ఖమ్మం, వెలుగు : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కళాశాల నిర్మాణం కోసం రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల నిర్మాణం, దానికి అనుబంధంగా ప్రభుత్వాసుపత్రి, వైద్య విద్యార్థుల బోధనా, బోధనేతర సిబ్బందికి వసతి గృహాలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన స్థలం పాత కలెక్టరేట్ ప్రాంతం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా లేదని మంత్రి దృష్టికి అధికారులు తీసుకురాగా, రఘునాథపాలెంలో మండలంలో 35 ఎకరాలను ఎంపిక చేశారు. అధునాతన సౌకర్యాలతో అన్ని భవన నిర్మాణాలు సత్వరమే చేపట్టి, వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు.