
- కలెక్టర్లకు నిధులు కేటాయించాలి : మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులతో సమీక్ష
నల్గొండ, వెలుగు: వేసవి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగు, సాగు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు రావొద్దని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం నల్గొండ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో ఉమ్మడి జిల్లాకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా, పంటలు ఎండిపోకుండా, విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగేలా సంబంధిత శాఖల సీనియర్ అధికారులు మొదలుకొని, కిందిస్థాయి అధికారుల వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నీటి సమస్యలు తీర్చేందుకు అవసరమైతే కలెక్టర్ల వద్ద నిధులు ఉంచేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడతానన్నారు. అలాగే, ఎమ్మెల్యేలకు ఎస్ డీఎఫ్ కింద నిధులిచ్చేలా చూస్తానని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రాజెక్టుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని సరిగా వినియోగించాలని సూచించారు.
రూ.15 కోట్లు మంజూరు చేయాలి: శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తాగునీటి అవసరాల కోసం ప్రతీ జిల్లాకు కనీసం రూ.5 కోట్లు, నల్గొండ జిల్లా విస్తీర్ణం పెద్దగా ఉన్నందున రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయాలి. అధికారులు ఎక్కడ తాగునీటి సమస్య ఉంటే అక్కడికి వెళ్లి వెంటనే సమస్యను పరిష్కరించాలి. సాగునీటిపై ప్రత్యేక దృష్టిసారించాలని, మేజర్ ప్రాజెక్టులు, కెనాళ్ల నిర్వహణ చూడాలి. ఏఎంఆర్ ప్రాజెక్టు కింద కెనాల్ విస్తరణ, లైనింగ్ చేపడితే సమృద్ధిగా నీరందించవచ్చు. ఉదయ సముద్రం మేజర్ కెనాల్ పూర్తి చేసి, చెరువులకు నీరిస్తే సాగునీటి సమస్య రాదు. సాగునీటి ప్రాజెక్టుల కెనాళ్లపై వందలాది మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. అవసరం లేకున్నా నిరంతరం పవర్ బోర్లు నడుస్తున్నాయి. దీనివల్ల విద్యుత్ తో పాటు నీరు వృథా అవుతుంది. వీటిని నియంత్రించే విషయమై అధికారులు ఆలోచించాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో విద్యుత్ సరఫరాలో ఎక్కడా సమస్య లేదు. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు వేసవిలో అప్రమత్తంగా ఉండాలి.
రూ.10.30 కోట్లు అవసరం :కలెక్టర్ ఇలా త్రిపాఠి
జిల్లాలో 26 సమస్యాత్మక గ్రామాలను గుర్తించాం. పైప్‌లైన్ మరమ్మతులు, ఇతర సమస్యల పరిష్కారానికి ఎస్ డీఎఫ్ కింద రూ.10.30 కోట్లు కావాలి. నల్గొండ జిల్లాలో 1775 గ్రామాలు ఉన్నాయి. ప్రతీరోజు140 ఎం ఎల్ డీ తాగునీరు అవసరం ఉంది. విలీన గ్రామాలలో తప్ప ఎక్కడా సమస్య లేదు. విద్యుత్ కు సంబంధించి సమస్యలు లేవు. సబ్ డివిజన్ వారీగా 250 ట్రాన్స్ఫార్మర్లు కావాలి. 9 క్విక్ రెస్పాన్స్ టీం వాహనాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇరిగేషన్ కింద నాగార్జునసాగర్ ద్వారా రెండు పంటలకు సాగునీరు ఇస్తున్నాం.
వచ్చే 10 రోజుల వరకు ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా కొనసాగుతుంది. ఆ తర్వాత శ్రీశైలం నుంచి సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుందని కలెక్టర్ మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జై వీర్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి, బాలు నాయక్, మిషన్ భగీరథ ఈఎన్ సీ కృపాకర్ రెడ్డి, కలెక్టర్లు తేజస్ నంద్ లాల్ పవార్, హనుమంతరావు, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఇరిగేషన్ ఈ ఎన్ సీ హరిలాల్, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
తాగునీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లయ్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు వేసవిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించాలి. కలెక్టర్లు తాగునీటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతీ గ్రామానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున అందుబాటులో ఉంచి, ఎక్కడైనా తాగునీటి సమస్య ఎదురైతే వెంటనే ఈ నిధుల ద్వారా పరిష్కరించాలి. ఎమ్మెల్యేలు సైతం ఎస్ డీఎఫ్ నుంచి తాగునీటి కోసం నిధులు కేటాయించాలి.