జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఖమ్మం సిటీ డెవలప్ : తుమ్మల నాగేశ్వరరావు    

జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఖమ్మం సిటీ డెవలప్ : తుమ్మల నాగేశ్వరరావు    
  • కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఖమ్మం సిటీలో సమగ్ర అభివృద్ధి జరగాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర అభివృద్ధి పై కార్పొరేటర్లు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం నగరం అందంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సాధిస్తామన్నారు. సిటీలో స్వచ్ఛమైన గాలి, సురక్షిత తాగునీరు, క్వాలిటీ రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు.

ఇంటి నంబర్లు లేని ఇండ్లకు వెంటనే నంబర్లు ఇవ్వాలని చెప్పారు. వర్షాకాలంలో శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్ల వెడల్పుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేటప్పుడు కరెంట్ తీగలు చూసుకోవాలని, భవిష్యత్​లో ఇతర ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భారీ వాహనాలు ఖమ్మం నగరంలోకి రాకుండా, హైదరాబాద్ తరహాలో అమరావతి, దేవరపల్లి రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామన్నారు. 

ప్లాన్​ను కార్పొరేటర్లకు అందజేస్తాం : కేఎంసీ కమిషనర్​

శానిటేషన్ ప్రణాళికను కార్పొరేటర్లకు అందజేస్తామని ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఏబీసీ కేంద్రం ద్వారా త్వరలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జేసీబీ, ట్రాక్టర్, పరికరాల రిపేర్లు చేపట్టి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. సమావేశంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ సురేందర్, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఆదాయం పెంపునకు చర్యలు : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఆదాయం పెంపునకు ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఆస్తి, వాణిజ్య, నీటి పన్నుల వసూలు 100 శాతం జరగాలన్నారు. టౌన్ ప్లానింగ్ ద్వారా లే అవుట్ అనుమతుల నుంచి ఆదాయం పెంచుకోవాలని చెప్పారు. అనుమతి లేకుండా జరుగుతున్న నిర్మాణాలను ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త సేకరణ సమర్థవంతంగా చేయాలని చెప్పారు.