ఖమ్మం రూరల్, వెలుగు : పత్తి రైతులకు మద్దతు ధర దక్కేలా సీసీఐ, మార్కెటింగ్, రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా పంటలో తేమ ఉంటుందని, రైతులు ఓపికగా పంటను ఆరబెట్టుకొని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని చెప్పారు.
రాష్ట్రంలోని 44 లక్షల ఎకరాల్లో పండిన పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తేనే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మాలని సూచించారు. పత్తి, మిర్చి పండించే రైతులు ఆయిల్‌పామ్ వైపు దృష్టి సారించాలన్నారు. సంప్రదాయ వ్యవసాయం చేసి నష్టపోయే కంటే లాభదాయక పంటలు సాగు చేయడం, ఒకే భూమిలో రెండు, మూడు పంటలు పండించే వైపు రైతులు ఆలోచించాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 9 జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.
మార్కెట్ యార్డుల్లో ప్రైవేట్ వ్యాపారులు సైతం పత్తిని కొనుగోలు చేస్తారన్నారు. మద్దతు ధర ఇవ్వకున్నా, కటింగ్ లాంటి సమస్యలు ఉన్నా సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ బాబు, నాయకులు మద్ది మల్లారెడ్డి, తేజావత్ పంతులు నాయక్, తమ్మినేని నవీన్, అంబటి సుబ్బారావు, ఖమ్మం ఆర్డీవో జి. గణేశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ. అలీం, మార్కెట్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.