- పార్క్ రోడ్డు పనులకు శంకుస్థాపన
ఖమ్మం టౌన్, వెలుగు : ఉగాది లోపు వెలుగుమట్ల అర్బన్ పార్క్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు సూచించారు. ఆదివారం ఖమ్మంలోని 15వ డివిజన్ లో ఆయన పర్యటించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో చేపట్టిన వెలుగుమట్ల అర్బన్ పార్కు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో వెలుగుమట్ల అర్బన్ పార్కు కు వచ్చి ప్రశాంతంగా గడిపేలా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్ స్థలం ఎక్కడి వరకు ఉందో సర్వే చేసి ప్రహరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. నగరంలో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా అమలు చేయాలన్నారు. అనంతరం మంత్రి ఆర్యవైశ్య, కమ్మ, బంజారల వనసమారాధన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, 15వ డివిజన్ కార్పొరేటర్ రావూరి కరుణ తదితరులు పాల్గొన్నారు.
సమాజ అభివృద్ధికి పాటుపడాలి
వైరా : కమ్మ జన సేవా సమితి సమాజాభివృద్ధికి పాటుపడాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. వైరాలోని కొల్లివారి మామిడితోటలో కమ్మ జన సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస వన సమారాధన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుటుంబ సమేతంగా పూజలు, వనభోజనాలు చేసుకోవడం శుభప్రదం అన్నారు. కమ్మజన సేవకులు సేవ రంగాల్లో ముందుండాలని కోరారు.
సత్తుపల్లి : స్థానిక అర్బన్ పార్క్ లో ఏర్పాటు చేసిన కమ్మ కులస్థుల వన సమారాధన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి ప్రాంతాన్ని తను ఎక్కడ ఉన్నా మరువనన్నారు. ఏ నియోజకవర్గంలో కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేకు 3 ఎగ్జిట్ లు లేవని, కానీ ఇక్కడ వేంసూరు, పెనుబల్లి, కల్లూరు ప్రాంతాలలో ఎగ్జిట్ పాయింట్లు సాధించామన్నారు. వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు.