ఖమ్మం టౌన్, వెలుగు : భూ ఆక్రమణలు చేసినోళ్లను వదులబోమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నాయకుడు చిత్తశుద్ధితో పని చేయలే తప్ప.. వ్యక్తిగతం కోసం పని చేయొద్దని సూచించారు. బుధవారం ఖమ్మం సిటీలోని 16వ డివిజన్ శ్రీరామ్ నగర్ లో డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైన్ల లెవల్స్ కరెక్ట్ గా పాటించి నిర్మించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కబ్జాలు, అక్రమణలు, బెదిరింపులతో ఖమ్మం ను అతలాకుతలం చేశారని ఆరోపించారు.
రోడ్లు ఆక్రమించి షెడ్లు, ఇండ్లు నిర్మిస్తుంటే అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ఏమిచేశారని ప్రశ్నించారు. ‘ఆ ఆక్రమణల వల్ల ఇండ్లు మునుగుతుంటే నేను కూల్చాలా? మీ పని మీరు సక్రమంగా చేస్తే ఇవ్వాళ నేను నింద మోయను కదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో ఎవరో కబ్జా చేశారని తెలిసిందని, రేపే అధికారులను పంపించి హద్దులు పెట్టిస్తానని తెలిపారు. వరదల్లో మునిగిన బాధితులకు ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో పచ్చదనం కోసం అనవసరమైన మొక్కలు నాటారని, ఇప్పుడు వాటి వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని నరికేస్తున్నారని, అలాంటి మొక్కలకు ఒక్కోదానికి రూ.10 పెట్టి కొనుగోలు చేసి రూ.100 బిల్లు తీసుకున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సిటీ మేయర్ నీరజ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పలువురికి నివాళి
కల్లూరు/తల్లాడ : కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని జిడిబిపల్లికి చెందిన సీనియర్ నాయకుడు, సంఘం వీరభద్రం ఇటీవల ఆకస్మికంగా మృతి చెందాడు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గ్రామానికి వెళ్లి వీరభద్రం ఫొటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. తల్లాడ మండలం ముద్దునూరు మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకుడు యరమల వెంకటేశ్వర రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, నాయకులతో కలిసి వెళ్లి పరామర్శించారు. డెడ్‌బాడీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు.