- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆస్పత్రుల పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష
ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య, ఆరోగ్య సేవల్లో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణితో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, వసతులు, మెడికల్ కాలేజ్ స్థితి గతులపై సమీక్షించారు. సంక్రాంతి తర్వాత మంత్రి దామోదర రాజనర్సింహ మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.
మెడికల్ కాలేజ్ కు అనుబంధం గా నర్సింగ్ కాలేజ్ ను మంజూరు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా వసతులు లేవనే మాట వినబడకుండా చూడాలన్నారు. గతంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 500 పడకలుండేవని, కరోనా సమయంలో ఆ సంఖ్యను 420కి కుదించారని, దాన్ని ఇప్పుడు 575 పడకలకు పెంచాలని తుమ్మల ప్రతిపాదించారు. జిల్లాలోని కల్లూరు, సత్తుపల్లి ఇతర ఏరియాల్లోనూ అత్యాధునిక వసతులతో హాస్పిటళ్లను తీర్చిదిద్దాలని సూచించారు. అత్యవసర సేవలకు 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.