- మున్నేరు సీసీ వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ బృందంతో మంత్రి తుమ్మల
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని మున్నేరు నది సీసీ వాల్ హైట్ భవిష్యత్‌లో పెంచుకునేలా ప్రస్తుతం నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శనివారం వాల్ ప్రొటెక్షన్ నిర్మాణ పనులపై నిర్మాణ సంస్థ బృందం ప్రతినిధులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ రెండు నియోజకవర్గాలకు సంబంధించిందన్నారు. వర్షాకాలంలో ఎంత వరద వచ్చినా మురుగు కాల్వల ద్వారా, టౌన్ లోకి బ్యాక్ వాటర్ రాకుండా పటిష్టమైన డ్రైనేజ్ సిస్టం ను ఏర్పాటు చేయాలని చెప్పారు.
ప్రాజెక్ట్ ప్రారంభమైన ప్రాంతం నుంచి ప్రకాశ్‌నగర్ దిగువ భాగం వరకు ఎప్పుడు నీళ్లు నిలువ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైతే కొత్త చెక్ డ్యాం ల నిర్మాణానికి ప్రపోజల్స్ తయారు చేసి, ఖమ్మం పట్టణానికి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. నదిలో చెత్త పడేయకుండా రెయిలింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. వైకుంఠధామల వద్ద కర్మకాండల కోసం వచ్చే వారికి స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించిన భూసేకరణ విషయంలో ఏదైనా సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కాంగ్రెస్ లోకి జడ్పీటీసీ మాలోతు ప్రియాంక
ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం బీఆర్ఎస్ కు చెందిన జడ్పీటీసీ సభ్యురాలు మాలోతు ప్రియాంక శనివారం మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రియాంకకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రియాంక మాట్లాడుతూ తన సొంత కుటుంబంలోకి తిరిగిరావడం సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు ఖానాపురం యూపీహెచ్ కాలనీలోని శ్రీ స్వయంభు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.
నాలుగో డివిజన్ లో ఎమ్మార్పీఎస్ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు గుండెపాక నర్సయ్య స్వగృహంలో ఇచ్చిన తేనేటి విందుకు తుమ్మల హాజరయ్యారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్, సీనియర్ లీడర్లు గుత్తా వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు లాకావత్ సైదులు, మలీద్ జగన్, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, దిరిశాల చిన్న వెంకటేశ్వరరావు ఉన్నారు.