ఖమ్మం, వెలుగు: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాన రహదారుల అభివృద్ధి, బ్రిడ్జిల నిర్మాణం, బ్రిడ్జిల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్ నిర్మాణం, నూతన జాతీయ రహదారుల నిర్మాణం, పాత బైపాస్ రిపేర్లు చేపట్టాలని కోరారు. రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగుపడితే వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే నేషనల్ హైవేస్ హైదరాబాద్ రీజనల్ ఆఫీసర్ కు కూడా తుమ్మల లేఖ రాశారు.
లేఖలో ప్రస్తావించిన వివరాలు ఇవే..!
- ఖమ్మం నాయుడుపేట జంక్షన్ నుంచి మున్నేరు బ్రిడ్జి వరకు మూడు బ్లాక్ స్పాట్స్ ఉన్నందున నాలుగు లైన్ల రహదారి, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలి.
- ఖమ్మం అశ్వరావుపేట రోడ్డులో కొణిజర్ల, కల్లూరు, పెనుబల్లి, దమ్మపేట నాలుగు పట్టణాలలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణం, సైడ్ కాల్వలు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలి.
- వైరా వద్ద కట్టలేరు వాగుపై, సత్తుపల్లి వద్ద తమ్మిలేరు వాగుపై బ్రిడ్జిలను విస్తరించాలి.
- కోదాడ–ఖమ్మం రోడ్డులో వెంకటగిరి నుంచి వెంకటాపురం వరకు రోడ్డు విస్తరించాలి.
- సారపాక నుంచి ఏటూరునాగారం వరకు నూతన జాతీయ రహదారిని మంజూరు చేయాలి. జాతీయ రహదారితో అశ్వాపురం, మణుగూరు వద్ద పారిశ్రామిక అభివృద్ధి, భద్రాచలం, మేడారం భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
- జగ్గయ్యపేట నుంచి కొత్తగూడం వరకు వయా బోనకల్, వైరా, తల్లాడ నూతన జాతీయ రహదారి మంజూరు చేయాలి.
- సారపాక నుంచి రేచర్ల (ఆంధ్రప్రదేశ్) వయా బూర్గంపాడు, వెంకటాపురం, ముల్కలపల్లి, దమ్మపేట, మందలపల్లి, అల్లిపల్లి వరకు నూతన జాతీయ రహదారిగా ప్రకటించాలి.