- అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశం
- సెక్రటేరియెట్‌లో సీసీఐ, అగ్రికల్చర్, మార్కెటింగ్ అధికారులతో మంత్రి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం పేమెంట్ ట్రాకింగ్సిస్టమ్ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పత్తి కొనుగోళ్లకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.సోమవారం సెక్రటేరియట్లో సీసీఐ, అగ్రికల్చర్, మార్కెటింగ్ అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. కాటన్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, తీసుకోవాల్సిన సన్నాహాక చర్యలపై అధికారులతో చర్చించారు.
నంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘పత్తి కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చట్టానికి లోబడి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. కాటన్ వెల్పేర్ స్టేట్, డిస్టిక్ కమిటీలలో రైతులను చేర్చుకోవాలి’’ అని చెప్పారు. రాష్ట్రంలో దేశంలో పత్తి సాగు, దిగుబడి వివరాలు, గత ఏడాది విక్రయాలు, ఎదురైన సమస్యలను మంత్రికి అధికారులు వివరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద, ట్రాన్స్ పోర్టులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రస్తావించారు.
జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ..‘‘సీసీఐ తీసుకొచ్చిన వెయిటేజ్ పద్ధతుల (కొత్త విధానం) ఫలితంగా జిన్నింగ్ మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రైతులు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్లి విక్రయాలు చేయాల్సి వస్తుంది. ఈసారి మద్దతు ధర పెరిగింది. కొనుగోలు కేంద్రాలకు పత్తి ఎక్కువ వచ్చే అవకాశముంది. రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది’’ అని సూచించారు.
సీఐ ఎండీ మాట్లాడుతూ.. ‘‘జిన్నింగ్ మిల్లులకు ప్రాధాన్యతా క్రమంలో పత్తిని కేటాయించడానికే.. కానీ అంతకంటే మంచి పద్ధతి ఏమైనా ఉంటే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, సీసీఐ సీఎండి లలిత్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.