వ్యవసాయ పరికరాలు​ ఎక్కువ మంది రైతులకు అందాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరావు

వ్యవసాయ పరికరాలు​ ఎక్కువ మంది  రైతులకు అందాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరావు
  • అందుకు తగ్గట్టుగా బడ్జెట్​రూపొందించాలి
  • వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ పరికరాలు, యంత్రాలు సబ్సిడీపై ఎక్కువ మంది రైతులకు అందేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆదేశించారు. రాష్ట్రానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవడంతో పాటు అదనంగా అవసరమయ్యే నిధుల కోసం ఎప్పటికప్పుడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గతంలో కేంద్ర పథకాలకు రాష్ట్రవాటా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. 

రైతుల వద్దకే వెళ్లి మట్టి నమూనా పరీక్షలు చేసేందుకు వీలుగా సంచార పరీక్ష కేంద్రాన్ని మొదటి దశలో ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున.. తరువాత 32 జిల్లాలకు ఒకటి ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అదనంగా మరో 1000 రైతు వేదికలకు వీసీ సౌకర్యాన్ని రెండు, మూడు నెలలలో కల్పించాలని సూచించారు. రైతువేదికల నిర్వహణ ఖర్చులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్లి వాళ్ల ఉత్పత్తులను కొనేలా మూడు ఆధునిక మార్కెట్లను ఏర్పాటు చేయాలని కోరారు. 

మల్బరి రైతులకు సకాలంలో సబ్సిడీ అందించి పట్టుపురుగుల పెంపకం, మార్కెటింగ్ వసతులు వృద్ధి చేయాలన్నారు. రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనె గింజలు, కూరగాయలు సాగుచేసే రైతులను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. ప్రతి 3 నెలలకోసారి ప్రతి పథకం పురోగతిని సమీక్షిస్తానని మంత్రి చెప్పారు. మార్కెటింగ్ లో మార్కెట్ కమిటీల పునర్విభజనకు వస్తున్న ప్రతిపాదనలు దీర్ఘకాలం పెండింగ్ లో పెట్టడంపై మార్కెటింగ్ కార్యాలయం ఉన్నతోద్యోగిపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మూడు  రోజులలో అన్ని విజ్ఙప్తులను పరిశీలించి, రిపోర్టు పంపించాలని  మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్​ను ఆదేశించారు. ఈ సమీక్షలో అగ్రికల్చర్​ డైరెక్టర్​గోపీ, హార్టీకల్చర్​ డైరెక్టర్​యాస్మిన్ బాషా, మార్కెటింగ్ కో ఆపరేటివ్ డైరెక్టర్​ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

రైతుభరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రైతు భరోసా పథకానికి సంబంధించిన చర్యలను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించిన విధంగా ఈ యాసంగి సీజన్ నుంచి వ్యవసాయానికి అనువైన భూములన్నింటికి రైతుభరోసాను వర్తింపచేయాలని తెలిపారు. వివిధ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. 

మండలాలు, గ్రామాల వారీగా భూముల విస్తీర్ణాలు, సర్వే నెంబర్ల వారీగా వివరాలను సమర్పించడానికి వారి వద్ద గల సమాచారాన్ని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ ఉద్యోగుల సేవలను ప్రభుత్వం వినియోగించుకొని, గ్రామాల వారీగా సర్వే చేసి భూములను నిర్ధారణ చేయాలని నిర్ణయించుకున్నామని మంత్రి పేర్కొన్నారు.