పదవుల కోసం మోకరిల్లలేదు.. ఎంపీ అర్వింద్​కు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని, పదవులు, టికెట్ల కోసం ఎప్పుడూ.. ఏ నాయకుడి ముందు మోకరిల్లలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో.. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు రేవంత్ రెడ్డి వరకు ఏ కేబినెట్​లో పని చేసినా.. ఏ హోదాలో విధులు నిర్వర్తించినా.. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం తప్ప తనకు మరో ఎజెండా లేదని తెలిపారు. తన రాజకీయ జీవితంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన అనుచిత కామెంట్లను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అర్వింద్​కు తుమ్మల బుధవారం బహిరంగ లేఖ రాశారు.

‘‘నిజామాబాద్ జిల్లాకు కేంద్రం పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా అర్వింద్ నాపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేశారు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఓ రైతుగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేసిన. ఇందులో మీకున్న అభ్యంతరం ఏంటి? మీ ఆవేదన.. ఆక్రోశం దేని కోసం? నన్ను పార్టీలో చేర్చుకోండి.. టికెట్ ఇవ్వండి.. నాకు పదవి ఇవ్వండి అని 40 ఏండ్లలో ఏనాడూ.. ఎవరినీ అడగలేదు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాను ఎంతో అభివృద్ధి చేసిన. కేంద్ర మంత్రులు గడ్కరీ, కిషన్ రెడ్డిని అడిగితే నా పనితనం గురించి చెప్తరు. నా రాజకీయ జీవితం, వ్యక్తిత్వం గురించి బీజేపీ లీడర్లు విద్యాసాగర్ రావు, లక్ష్మణ్, దత్తాత్రేయను అడిగి తెలుసుకో’’అని లేఖలో అర్వింద్​కు తుమ్మల సూచించారు. రెండు సార్లు ఎంపీగా గెలిచి.. ఇలా దిగజారి మాట్లాడం సరికాదన్నారు.