
- వచ్చే వానాకాలం సీజన్ విత్తన అవసరాలపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: డిమాండ్ ఉన్న విత్తన రకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటెరియెట్లో రానున్న సీజన్లో విత్తనాల అవసరాలు, లభ్యత, సరఫరాపై అగ్రికల్చర్ అధికారులు, సీడ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వచ్చే వానాకాలం సీజన్ పంటలకు సంబంధించి విత్తనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అన్నారు. వరి విత్తనాలకు సంబంధించిన రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతు వేదికల్లో విత్తన ఎంపిక, కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని నకిలీ విత్తన విక్రయాలను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని విత్తన కంపెనీలను ఆదేశించారు. అలాగే రాష్ట్రం విత్తన ఉత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు.
మధ్యవర్తులు కొందరు రైతులకు దక్కాల్సిన ధర, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. సీడ్ మెన్ అసోసియేషన్, కంపెనీ ప్రతినిధులతో చర్చించి విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలకు, రైతులకు మధ్య కుదిరేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో పత్తికి సంబంధించి 2.4 కోట్ల కాటన్ సీడ్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్టు చెప్పారు.