సీతారామ కెనాల్ పనులు పూర్తి చేయండి : మంత్రి తుమ్మల

సీతారామ కెనాల్ పనులు పూర్తి చేయండి :  మంత్రి తుమ్మల

తల్లాడ, వెలుగు: సీతారామ ప్రాజెక్ట్ లింక్ కెనాల్ పనులు త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రొసీజర్స్, ఫార్మాలిటీస్ పూర్తి కాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి  మాట ప్రకారం రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరమే కెనాల్ పనులు పూర్తి చేసి నాలుగు పంప్ హౌస్ లు పూర్తి చేసుకున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1.50 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పారు.

నాగార్జునసాగర్ కాలువ ఆయకట్టుతో పాటు వైరా, లంక సాగర్ ప్రాజెక్ట్, కల్లూరు పెద్ద చెరువులు నింపుతూ లిఫ్ట్ ఇరిగేషన్ లను అనుసంధానం చేస్తామన్నారు. కృష్ణా జలాలు రాకపోయినా సీఎం సహకారంతో గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కెనాల్ పనులకు భూములు త్యాగం చేసిన రైతులు నష్టపోకుండా న్యాయం చేసి వారి రుణం తీర్చుకుంటామని చెప్పారు.