మే నెలాఖరు కల్లా సీతారామ కాలువ పనులు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరారావు నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సత్తుపల్లి, పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష సందర్భంగా సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా సమీక్షించారు.
పెండింగ్ లో ఉన్న సీతారామ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు మంత్రి తుమ్మల. అనుకున్న స్థాయిలో పనుల్లో వేగం పెంచితే.. ఈ ఏడాదిలోనే వైరా ప్రాజెక్టు, లంకా సాగర్, ఎన్నెస్పీ ఆయకట్టులోని సుమారు లక్షా 60 వేల ఎకరాలకు సాగు నీరు అందించే విధంగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సుమారు రూ. 7500 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి మూడు పంప్ హౌజ్ లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు.
ఏన్కూరు దగ్గర లింకు కెనాల్ పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని తుమ్మల సూచించారు. సుమారు రూ. 70 కోట్లతో ఈ పనులుపూర్తి చేస్తే వచ్చే సీజన్ లోనే వైరా ప్రాజెక్టు, లంకసాగర్, బేతుపల్లి పరిధిలో ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉందన్నారు. ఇటీవల గండుగులపల్లిలో జరిగిన సమావేశంలో సమీక్షించిన అంశాలను ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి మంత్రి తుమ్మల తీసుకెళ్లగా.. సంబంధిత పనులను దశల వారీగా ప్రాధాన్యతను బట్టి పూర్తిచేసి మే నెలాఖరు కల్లా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. యాతాలకుంట భూసేకరణ పూర్తయితే సత్తుపల్లి టన్నెల్ ద్వారా లంకసాగర్, బేతుపల్లి కెనాల్ కు ఈ సీజన్ లోనే సాగునీరు అందించే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. సీతారామ కాలువల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
మే నెలాఖరు కల్లా అన్ని ప్రాంతాల్లో కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏన్కూరు వద్ద కాలువ పనులు పూర్తి చేస్తే.. అక్కడి నుంచి వైరా ప్రాజెక్టుకు లింకు కెనాల్ కలిపే పనులు చేపట్టవచ్చని.. ఈ పనులకు సంబంధించి వెంటనే టెండర్లు ఆహ్వానించాలని నీటి పారుదల శాఖ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఈ పనులు పూర్తయితే.. సీతారామ ద్వారా నీరు ఎన్నెస్పీ ఆయకట్టుకు నీరు అందించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. లింకు కెనాల్ పనులు పూర్తి చేస్తే.. వైరా జర్వాయర్ తోపాటు లంకాసాగర్ కు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. సత్తుపల్లి ట్రంకు కెనాల్ కు సంబంధిచి భూ సేకరణకు చెల్లించాల్సిన రూ. 12 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూసేకరణ నిధులు చెల్లించి వెంటనే పనులు చేపడితే యాతాలకుంట ట్రంకు పనులు పూర్తి చేయవచ్చని సూచించారు. అదేవిధంగా పాలేరు టన్నెల్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాలేరు టన్నెల్ ద్వారా పాలేరు రిజర్వాయర్ కు సైతం నీరు అందించే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు. పై పనులన్నీ పూర్తి చేస్తే వైరా రిజర్వాయర్ కింద లక్షా 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవచ్చని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూశాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.