- ఆ పార్టీ నేతలకు మంత్రి తుమ్మల సవాల్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గానీ రుణమాఫీ చేయగలరా? అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆ పార్టీ నేతలకు సవాల్‌విసిరారు. లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయగలరా? అని తుమ్మల ప్రశ్నించారు. బీజేపీ ధర్నాపై మంత్రి తుమ్మల సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో రుణమాఫీ చేస్తూ.. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడంతో పాటు అన్ని పంటలను మద్ధతు ధరకు కొనే విధంగాచర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా.. మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే తమపై అక్కసుతో విమర్శలు చేయడం సరికాదన్నారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్దానాలు ఏమయ్యాయని తుమ్మల నిలదీశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, ఆదుకోవాలని రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల విజ్ఙప్తులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఆయన అని ప్రశ్నించారు.
2 లక్షలలోపు రుణం మాఫీ చేసి తీరుతం
రాష్ట్రంలో ఇప్పటివరకు 22 లక్షల మందికి రూ.18 వేల కోట్లు రుణ మాఫీ చేశామని మంత్రి తెలిపారు. అర్హత ఉండి మాఫీ కాని వారికి ఆధార్ తప్పిదాలను సరి చేస్తున్నామని, కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే కొనసాగుతోందని తెలిపారు. రూ.2 లక్షలలోపు రుణం ఉన్న కుటుంబాలన్నింటికీ మాఫీ చేసి, తర్వాత ఇంకా మిగిలి ఉన్న రూ.2 లక్షలకు పైగా ఉన్న కుటుంబాలకు షెడ్యూలు ప్రకటించి దాని ప్రకారం రుణాలు మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించుకుంటూ అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏమైనా సందేహాలు ఉంటే బీజేపీ పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, కానీ రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని సూచించారు. 2023-=24లో సీఏసీపీ అంచనా వేసిన క్వింటాల్ వరి ధాన్యం ఉత్పత్తి ఖర్చు రూ.1,911కాగా, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు మద్దతు ధర రూ.2,876 ప్రకటించాల్సి ఉందన్నారు. బీజేపీ సర్కారు తప్పుడు పద్ధతుల్లో లెక్కించి కేవలం రూ.2,203 మాత్రమే ప్రకటించిందన్నారు. ఫలితంగా రైతులు ప్రతి క్వింటాల్‌కు రూ.664 నష్టపోయారని విమర్శించారు.
గత పదేండ్లలో ఒక్క తెలంగాణ రైతాంగమే ఇలా రూ.2 లక్షల కోట్లు నష్టపోయిందని తెలిపారు. కేంద్రంలో రాష్ట్ర, రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వాళ్లు నీతులు చెప్పడం తగదన్నారు. ఆహార భద్రత చట్టం కింద కేంద్రం బియ్యం, గోధుమలను మాత్రమే సేకరిస్తున్నదని, ఇది మోనోక్రాపింగ్ కు దారితీస్తుందన్నారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం రూ.392 కోట్లు వెచ్చించి రైతుల నుంచి కందులు, సోయాబీన్ , శనగలు, పొద్దుతిరుగుడు, జొన్నలను మద్ధతు ధరతో కొన్నామని వివరించారు.