హైడ్రాకు మద్దతివ్వండి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్ , వెలుగు: హైడ్రాకు పార్టీలు, కులాలు, మతాలు లేవని.. అన్ని రాజకీయ పార్టీలు దానికి మద్దతివ్వాలని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోరారు. మళ్లీ 1908 నాటి వరదలను పునరావృతం కాకుండా ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నదని చెప్పారు. చెరువులను కబ్జాల నుంచి రక్షించడమే హైడ్రా లక్ష్యమన్నారు. దేశ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని, ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్​ ఎర్రమంజిల్ లోని ఈఎన్సీ ఆఫీస్ లో జరిగిన ఇంజనీర్స్​ డే కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ..  ‘‘1908 లో  భారీ వరదలు వచ్చి హైదరాబాద్ మొత్తం నిండా మునిగింది. వేలాదిమంది వరదల్లో గల్లంతయితే..  విశ్వేశ్వరయ్య గురించి నిజాం నవాబు తెలుసుకొని హైదరాబాద్ కు ఆహ్వానించి హైదరాబాద్ లో ఫ్లడ్ ప్రొటెక్షన్ అండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు గురించి విన్నవించారు. హైదరాబాద్ భౌగోళిక స్థితిగతులపై పూర్తిగా అధ్యయనం చేసిన విశ్వేశ్వరయ్య .. సిటీ పైభాగంలో ఉన్న 788 చెరువులకు గాను వరదలతో దాదాపు 221 చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయని గుర్తించారు. 

ఈ వరదను తట్టుకోవాలంటే నగరానికి పైభాగంలో ఒక పెద్ద రిజర్వాయర్ కట్టాలని ప్రపోజ్ చేశారు. అందులో భాగంగా ఇప్పుడున్న హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేశారు” అని వివరించారు.  788 చెరువులతో ఉన్న హైదరాబాద్ పైభాగంలో ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నయో మనమంతా ఒకసారి ఆలోచించాలన్నారు.  ఈ దేశానికి అన్నంపెట్టే రైతన్నలు ఎంత ముఖ్యమో.. ప్రాజెక్టులు, బ్రిడ్జిలు, రోడ్లు, బిల్డింగ్స్​ నిర్మించే ఇంజనీర్లు అంతే ముఖ్యమని, మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.