ఆయకట్టు రైతుల ఆశలకు గండి

ఆయకట్టు రైతుల ఆశలకు గండి
  • భారీ వర్షాలతో సాగర్ మేజర్ కెనాల్ కు గండ్లు 
  • 10 రోజుల్లో పనులు పూర్తి కాకపోతే రైతులకు తీవ్ర నష్టం
  • మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం 
  • వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశం  

సూర్యాపేట, వెలుగు: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల ఆశలకు భారీ వర్షాలు గండి కొట్టాయి. గతేడాది వర్షాలు లేక సాగర్ డెడ్ స్టోరేజి చేరుకొని నీటి విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది వర్షాలతో నీటి కొరత తీరిందన్న ఆనందం ఎక్కువ రోజులు లేకుండా చేశాయి. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న మేజర్ల ద్వారా సాగునీరు చివరి ఆయకట్టుకు చేరక రైతులు ఇంతకాలం ఇబ్బందులు పడ్డారు.

వరుణుడు కరుణించడంతో మేజర్ల కింద చివరి భూములకు నీరు చేరడంతో రైతులు సంతోషంగా దుక్కులు దున్ని నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ దశలో నడిగూడెం వద్ద సాగర్‌ ఎడమ కాల్వకు గండి పడడంతో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో మేజర్ల కింద చివరి భూముల రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గండి పూడ్చేవరకు మరో వారం రోజులపైనే పట్టే అవకాశం ఉన్నందున దుక్కులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోపు గండ్లను పూడ్చి నీటిని పారిస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. దీంతో అధికారులు గండ్లను పూడ్చేందుకు పనులు ముమ్మరం చేశారు. 

సాగర్​ఎడమ కాల్వకు రెండు చోట్ల గండ్లు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం వద్ద సాగర్‌ ఎడమ కాల్వ 132, 133 కిలో మీటర్‌ వద్ద ఈనెల 8న రెండు చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల పరిధిలో కాగిత రామచంద్రాపురం, నాయకన్‌గూడెం, మాధారం, మందనర్సయ్యగూడెం గ్రామాల్లో సుమారు 1,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. భారీ వరదలకు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది.

ఎడమ కాల్వకు గండ్లకు మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం తక్షణ సాయం కింద ఈనెల 5న రూ.2.10 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎన్నెస్పీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే పనుల ప్రారంభానికి కొన్ని రోజులు వర్షాలు అడ్డంకిగా మారాయి. దీనికి తోడు కాల్వ కట్టలపై వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. రిపేర్లు చేసేందుకు భారీ వాహనాల్లో సామగ్రి తరలించాల్సి ఉంది.

అయితే భారీ వాహనాలు వచ్చేందుకు కాల్వ కట్టలు అనుకూలంగా లేవని ఎన్నెస్పీ అధికారులు పేర్కొంటున్నారు. పనులు ఆలస్యమైతే సాగు చేసిన పంటలు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్​ఎడమ కాల్వకు రెండు చోట్ల గండ్లు పడడంతో ఆయకట్టు పరిధిలో 42 ఎత్తిపోతల కింద ఉన్న 90 వేల ఎకరాలు, మేజర్‌, మైనర్‌ కాల్వల కింద ఉన్న పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. 

మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం..

వారం రోజుల్లో సాగర్​ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చి తిరిగి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. యుద్ధప్రాదికన పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి ఆదేశించారు. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పడంతో జిల్లా యంత్రాంగం రాత్రి, పగలు లేకుండా పనులు చేస్తున్నారు. గండి పడిన ప్రాంతాలను మట్టితో నింపుతున్నారు. పై నుంచి ఇప్పటికే వరద రాకుండా చర్యలు చేపట్టారు.


వారం రోజుల్లో పునరుద్ధరిస్తాం.. 

కాగిత రామచంద్ర పురం వద్ద గండి పడిన సాగర్ ఎడమ కాల్వ పనులను వారం రోజుల్లో పునరుద్ధరిస్తాం. రేయింబవళ్లు పనిచేసేందుకు ఏజెన్సీ ముందుకొచ్చింది. పనులను వేగవంతంగా చేస్తున్నాం. రాత్రి వేళ్లలో పనులకు ఆటంకం కలుగకుండా ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశాం.  – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి