
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, సన్న బియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చేయడంతో ప్రజలు తమ ఇండ్లలో వండిన అన్నం తినడానికి ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నారని చెప్పారు. శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో సీతారాముల కల్యాణం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారని తెలిపారు.
శుక్రవారం సూర్యాపేటలోని రెండో వార్డులో పాలడుగు బుజ్జమ్మ– వెంకటయ్య దంపతుల ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నాన్ని మంత్రి తిన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీని చేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా 6 కిలోల నాణ్యమైన సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు.
మెడికల్ కళాశాలలను పటిష్టం చేస్తాం..
రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను పటిష్టం చేస్తామని నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మెడికల్ కళాశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సూర్యాపేట మెడికల్ కళాశాల మొదటి స్నాతకోత్సావానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు 1000 సీట్లతో కూడిన ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి నిధులు, విద్యార్థుల సౌకర్యార్థం రెండు బస్సులను మంజూరు చేస్తానని ప్రకటించారు.
ప్రజల ఆరోగ్య భద్రత.. వైద్య విద్యార్థులపై ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అనంతరం ఎంబీబీఎస్పూర్తి చేసిన విద్యార్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, మందుల సామేల్, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.