- ప్రస్తుతం ఉన్న వాటిని రద్దు చేయబోమని వెల్లడి
మేళ్లచెరువు, వెలుగు: రేషన్ కార్డుల జారీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తున్నదని అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి కేవలం 40 వేల తెల్ల రేషన్ కార్డులే ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తాము కొత్తగా 40 లక్షల మందికి లబ్ధి చేకూరేలా రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఆదివారం మంత్రి ఉత్తమ్ మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా పాలకవీడు మండలం జాన్ పహడ్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త రేషన్‌కార్డుల జారీ, పేర్ల చేర్పు, తొలగింపు నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కార్డులు తొలగించబోమని తెలిపారు. బీఆర్‌ఎస్‌పాలనలో మీ సేవ ద్వారా చేసుకున్న 12,07,558 రేషన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అలాగే ప్రజా పాలన కార్యక్రమంలో 10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. మరోవైపు ఇటీవలి కులగణనలో కూడా రేషన్‌కార్డు లేని వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తేలిందన్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మొత్తం 40 లక్షల మంది నిరుపేదలకు లబ్ధి చేకూరేలా రేషన్‌కార్డులు జారీ చేస్తామన్నారు.
న్యాయబద్ధంగా, పారదర్శకమైన విధానంలో అర్హులైన వారందరికి మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. అలాగే దరఖాస్తులలో తప్పులు, లోపాలను సవరించుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. కుల సర్వే, సామాజిక ఆర్థిక డేటా ఆధారంగా అర్హులను గుర్తించి, నిజమైన లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.