అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఉత్తమ్

ఆరు గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డులపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.  కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని ఎత్తిపోతల పథకాలపై దృష్టి పెడుతానని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డలో జరిగిన అవకతవకలపై పరిశీలించేందుకు డిసెంబర్ 29వ తేదీన వెళ్తున్నామని తెలిపారు. 39 రూపాయలకు కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి.. రూపాయికే అందిస్తున్నామన్నారు. ఆ బియ్యం నాణ్యత మరింత పెరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. రేషన్ బియ్యాన్ని రీసైకిలింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.