వరద బాధితులకు అండగా ఉంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి 

వరద బాధితులకు అండగా ఉంటాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని సీఎంను కోరిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
  • రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

సూర్యాపేట, వెలుగు : ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం మోతే మండలంలోని నామవరం వద్ద వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో వరద వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి ఆయన వివరించారు. వర్షాలకు మృతి చెందినవారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు. పంట నష్టపరిహారం, ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని మంత్రి విజ్ఞప్తి  చేశారు. 

అధికారులను అప్రమత్తం చేశాం : కలెక్టర్ 

భారీ వర్షాలకు జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. గ్రామాల్లో ముందస్తుగా అధికార బృందాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. దీంతో ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. జిల్లాలో 5 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వర్షం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.

వ్యాపారస్తులకు పరిహారం అందించాలి..

కోదాడలో చిన్నచిన్న దుకాణాలు మునిగిపోయాయని, బాధితులకు నష్టపరిహారం అందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయినవారికి ఆర్థిక సాయం అందించాలన్నారు. కోదాడ మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. 

చెరువులకు మరమ్మతులు చేపట్టాలి.. 

భారీ వర్షానికి తుంగతుర్తి నియోజకవర్గంలో 670 చెరువులు తెగిపోయాయని, ఆ చెరువులకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే మందుల సామేల్ సీఎంను కోరారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. అంతకుముందు కోదాడ పట్టణంలోని తుమ్మరా వాగు బ్రిడ్జి, నడిగూడెం మండలం రామచంద్రపురం సాగర్​ కాల్వకు పడిన గండిని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పరిశీలించారు.  ఆయన వెంట నాయకులు, అధికారులు ఉన్నారు.  

రూ.23 కోట్లతో రహదారులకు మరమ్మతులు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 

భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 11 రోడ్లు తెగిపోయాయని, వాటన్నిటికీ మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించామని, ప్రాథమిక నివేదిక ప్రకారం ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులకు రూ.23 కోట్లు అవసరమవుతాయని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వరద తగ్గిన వెంటనే రహదారులకు మరమ్మతు పనులు చేపడతామన్నారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులతోపాటు ఇండ్లు కోల్పోయినవారికి అండగా ఉంటామని తెలిపారు. ఆర్ అండ్ బీ రహదారులతోపాటు పంచాయతీ రోడ్లను పునరుద్ధరిస్తామన్నారు.