
- కాళేశ్వరం కోసం లక్ష కోట్లు అప్ప చేసిండ్రు
- ఎక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్లు తీసుకుండ్రు
- కార్పొరేషన్ల పేరుతోటి కూడా అప్పులు తెచ్చిండ్రు
- ఏడాదికి రూ. 16 వేల కోట్ల వడ్డీ కడుతున్నం
- వాళ్లు డీపీఆర్ లో ఒకటి.. చేసింది మరొకటి
- డ్యాం సేఫ్టీ రూల్స్ ఫాలో కాలె.. సాయిల్ టెస్ట్ చేయలే
- కేసీఆర్.. తుమ్మడి హెట్టి దగ్గర కూడా ప్రాజెక్టు కడ్తమన్నరు
- పదేండ్లలో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు
- క్షమాపణ చెప్పాల్సింది పోయి విమర్శలా?
- ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయిట్ ప్రజెంటేషన్
- మాజీ సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం
హైదరాబాద్: కమీషన్ల కక్కుర్తి కోసమే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుకే ప్రాణహిత– చేవెళ్ల డిజైన్ మార్చేశారని ఆరోపించారు. 80 వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి.. లక్ష కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఇవాళ సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై ఎన్ఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రక రకాల కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేశారని, ఇది చాలదన్నట్టు ఎక్కువ వడ్డీకి షార్ట్ టర్మ్ లోన్లు కూడా తీసుకున్నారని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులకు నీటిపారుదల శాఖ ఏడా 16 వేల కోట్ల వడ్డీలు చెల్లిస్తోందని అన్నారు. డీపీఆర్ లో ఒకటి చెప్పి.. డిజైన్ ఒకటి చూపించి మరో చోట బ్యారేజీలు కట్టారని అన్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు సూచించిన నిబంధనలను ఎక్కడా ఫాలో కాలేదని అన్నారు. కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారని అన్నారు. కమీషన్ల కోసమే ప్రాణహిత– చేవెళ్ల డిజైన్లు మార్చారని ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను కట్టాల్సిన చోట నిర్మించలేదని చెప్పారు. డీపీఆర్ అంతా హడావుడిగా చేశారని అన్నారు. ఒక్కో బ్యారేజీ ఒక్కో రకంగా నిర్మించారని అన్నారు.
తుమ్మిడి హెట్టి దగ్గర కూడా ప్రాజెక్టు కడ్తామని చెప్పిన పదేండ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు నష్టం జరిగిందని అన్నారు. తుమ్మిడి హెట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం పచ్చి అబద్ధమని అన్నారు. దేశంలో ఘోరంగా నిర్మించిన ప్రాజెక్టు ఇదొక్కటేనని ఎన్ డీఎస్ ఏ తప్పు పట్టిందని వివరించారు. చేసిన తప్పుకు చెంపలేసుకొని తలదించుకోవాల్సింది పోయి విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. వాళ్ల హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కట్టారని, వాళ్ల హయాంలోనే కూలిపోయిందని అన్నారు.