- హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- మోడల్ కాలనీ పునరుద్ధరణ పనుల పైలాన్ ప్రారంభం
హుజూర్ నగర్, వెలుగు: ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 చొప్పున వచ్చే ఐదేండ్లలో తెలంగాణాలోని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హుజూర్ నగర్ లోని ఫణిగిరి సీతారామస్వామి గుట్ట దగ్గర మోడల్ కాలనీ పునరుద్ధరణ పనులకు పైలాన్ ను, టౌన్ హాల్ సుందరీకరణ, క్రిస్టియన్ శ్మశానవాటిక అభివృద్ది పనులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, తాను హౌజింగ్ మంత్రిగా ఉన్నప్పుడు100 ఎకరాల్లో 2160 ఇండ్లు మంజూరు చేశామని, పనులు 80 శాతం పూర్తయిన టైమ్‌లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ప్రభుత్వం కావాలనే ఈ ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. పదేళ్ళలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చాలాసార్లు ఇక్కడికి వచ్చినా పనులు పూర్తిచేయలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.74.80 కోట్లు మంజూరు చేశారని, కాలనీలో పనులన్నీ 7 నెలల్లో పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రకటించిన 6 గ్యారంటీ లను వంద రోజుల్లోనే అమలు చేసామన్నారు. త్వరలో అర్హత వున్నవారికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. హుజూర్ నగర్ లో ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తానన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం :స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. దళితుడనైనా తనకు స్పీ కర్ పదవి ఇచ్చి పార్టీ గౌరవించిందన్నారు. అంతకు ముందు కోదాడ, హుజూర్ నగర్ ఆటో డ్రైవర్ లకుదక్షత ఫౌండేషన్ ద్వారా ఇన్సూరెన్స్ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే, హౌజింగ్ ఎస్ఈ రవీంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టేతండా లో రూ.33.83 కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. పాలకవీడు మండలం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.