- నిత్యావసరాల రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టారని ఫైర్
మునగాల, వెలుగు : మతాన్ని అడ్డుపెట్టుకొని విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో నిర్వహించిన నల్గొండ పార్లమెంట్ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి మరో అవకాశం ఇస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయన్నారు.
గత పదేండ్లలో నిత్యవసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఓట్లు అడిగే అర్హత ప్రధాని నరేంద్ర మోదీకి లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నపుడు మునగాల మండలాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జానారెడ్డికి కానుకగా ఇవ్వాలన్నారు.
ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా అభివృద్ధికి తన తండ్రి జానారెడ్డి ఎంతగానో కృషి చేశారని, తనకు అవకాశం ఇస్తే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.