బనకచర్లకు అంగీకరించట్లేదని ఖరాఖండీగా చెప్పాం: మంత్రి ఉత్తమ్ కౌంటర్

బనకచర్లకు అంగీకరించట్లేదని ఖరాఖండీగా చెప్పాం: మంత్రి ఉత్తమ్ కౌంటర్

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నది జలాలు, బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తోన్న విమర్శలకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం (జనవరి 24) ఆయన సెక్రటేరియట్‎లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. మేం అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ హయంలో జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల  ప్రాజెక్టు విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశామని గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో ఇబ్బందులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాశామని.. ఆ లేఖను విడుదలు చేస్తున్నామన్నారు. బనకచర్ల ప్రాజెక్టును మేం అంగీకరించట్లేదని కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ఖరాఖండీగా చెప్పామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 

కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని 2015లోనే మేం కోరామని.. బీఆర్ఎస్ నేతలు మాత్రం 299 టీఎంసీలు చాలని ఒప్పుకున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల్లో నష్టం జరిగేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హరీష్ రావు ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు.