సీతారామ టెండర్లను త్వరగా పూర్తి చెయ్యండి..ప్రాధాన్య ప్రాజెక్టులు ఆలస్యం కావొద్దు: మంత్రి ఉత్తమ్

సీతారామ టెండర్లను త్వరగా పూర్తి చెయ్యండి..ప్రాధాన్య ప్రాజెక్టులు ఆలస్యం కావొద్దు: మంత్రి ఉత్తమ్
  • డిసెంబర్ మొదటి వారంలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
  • జిల్లా ప్రాజెక్టులపై పూర్తి రిపోర్టును సిద్ధం చేయండి
  • 27న సింగూరు ప్రాజెక్టుపై రివ్యూ చేస్తం
  • ఇరిగేషన్ శాఖ అధికారులతో  వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు:  సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సర్కారు చేపట్టిన ప్రాధాన్య ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం జరుగొద్దని అన్నారు. సోమవారం ఈఎన్సీలు, సీఈలతో ఉత్తమ్​కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  ప్రాధాన్య ప్రాజెక్ట్‌‌లకు వీలైనంత త్వరగా పరిపాలనా అనుమతులు తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

మోదికుంట వాగు ప్రాజెక్ట్ కు అయ్యే అంచనాలతోపాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు అవసరమైన భూసేకరణ ఎంతవరకు వచ్చిందని అధికారులను ప్రశ్నించారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్ట్ స్థితిగతులను తెలుసుకునేందుకు వచ్చే నెల మొదటి వారంలో రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.

సింగూరుపై రివ్యూకు సిద్ధంకండి

సింగూరు ప్రాజెక్ట్‌‌పై ఈ నెల 27న ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంటుందని, ఆ సమీక్షలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొంటారని ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన సమగ్ర సమాచారంతో అధికారులు హాజరుకావాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించామని, ఆయా పనులనూ వేగవంతం చేయాలని  అన్నారు.

 తద్వారా ప్రాజెక్టుల్లో సామర్థ్యం పెంచేలా చూడాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ‌‌పై ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డితో చర్చించి, సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు.