అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : ఉత్తమ్​కుమార్​రెడ్డి

అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి : ఉత్తమ్​కుమార్​రెడ్డి
  • మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

హుజూర్ నగర్, వెలుగు: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్​లోని జల సౌధలో కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల అధికారులతో సమీక్షించారు. హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి రూ. 1,15,701.91 లక్షల కోట్ల పనులు, కోదాడ నియోజకవర్గానికి సంబంధించి రూ. 51,999.91 లక్షల కోట్ల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఇరిగేషన్, ఆర్అండ్ బీ, లిఫ్టు నిర్మాణాల పనుల్లో జరుగుతున్న జాప్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇరిగేషన్ కు సంబంధించిన అధికారులు వేసవి రెండు నెలలు పాటు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో నిర్మించే రోడ్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించాలని వాటి ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సిందేనని ఆదేశించారు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ, జవహర్ నవోదయ కేంద్రీయ పాఠశాలలకు కావలసిన స్థల సేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఆర్అండ్ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఈఎన్ సీ అనిల్, ఈసీ రమేశ్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.