- ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేసిండు: మంత్రి ఉత్తమ్
- ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్.. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం పనికిరాకుండా పోయింది
- 2026 మార్చి కల్లా దేవాదుల పూర్తి.. 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు
- సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి ఏటా 60 టీఎంసీలు ఎత్తిపోస్తామని వెల్లడి
- మంత్రులు పొంగులేటి, సీతక్కతో కలిసి దేవాదుల, సమ్మక్క సాగర్ బ్యారేజీ పరిశీలన
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కేసీఆర్ గత పదేండ్లలో ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేశారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కట్టిన ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కామ్‌కు పాల్పడి, జేబులు నింపుకున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం ములుగు జిల్లాలోని దేవాదుల పంప్‌హౌస్, సమ్మక్క సాగర్ బ్యారేజీలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి ఉత్తమ్ పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. కేసీఆర్ గత పదేండ్లలో ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
2026 మార్చి కల్లా దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని ఉత్తమ్ తెలిపారు. ‘‘వైఎస్ సీఎంగా ఉన్న టైమ్‌లో దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన కోసం 2008లో సోనియాగాంధీ యూపీఏ చైర్ పర్సన్ హోదాలో హాజరయ్యారు. 2026 మార్చి నాటికి దేవాదుల పనులన్నీ పూర్తి చేసి, మళ్లీ సోనియాగాంధీ చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తాం. తద్వారా వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని 5.57 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతాయి” అని చెప్పారు.
సమ్మక్క సాగర్ నుంచి 60 టీఎంసీలు ఎత్తిపోస్తం..
సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు చత్తీస్ గఢ్ రాష్ట్రాన్ని ఒప్పించి, 300 రోజుల పాటు మోటార్లు నడపడం ద్వారా 60 టీఎంసీలు ఎత్తిపోస్తామని ఉత్తమ్ తెలిపారు. ఇందుకోసం ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ నాగేందర్‌ను చత్తీస్ గఢ్ కు పంపించామని చెప్పారు. ‘‘ఇరిగేషన్ శాఖ బలోపేతం కోసం 700 మంది సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను, 1,800 మంది లష్కర్లను ఔట్ సోర్సింగ్ పై నియమించాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ లకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయడానికి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తాం.
కాల్వల్లో పూడికతీత, జంగల్ క్లియరెన్స్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనుల కోసం రూ.1,100 కోట్లు కేటాయిస్తాం. పెండింగ్ బిల్లులు క్లియర్చేస్తాం” అని వెల్లడించారు. ఇంజినీర్లు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. భూసేకరణకు రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు చేతినిండా పని : సీతక్క
ఇరిగేషన్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు చేతినిండా పని దొరుకుతుందని, తద్వారా పేదరికం తగ్గుతుందని మంత్రి సీతక్క అన్నారు. ‘‘దేవాదుల ప్రాజెక్టు ద్వారా ములుగు నియోజకవర్గానికి సాగు నీరు రావడం లేదు. తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు మానవీయ కోణంలో తగిన నష్టపరిహారం అందించాలి. మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారంలో కెనాల్స్ పై ఏర్పాటు చేసిన లిఫ్ట్‌లు సరిగా పని చేయక రైతులకు సాగునీరు అందడం లేదు. రామప్ప నుంచి పాకాల పోయే ప్రాంతంలో 6 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి కాలువలు నిర్మించాలి” అని ఇరిగేషన్ మంత్రిని కోరారు. రామప్ప నుంచి లక్నవరానికి కెనాల్ మంజూరు చేశారని, కానీ ఇప్పటివరకు భూసేకరణ జరగలేదన్నారు. ఈ పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ALSO READ : వేములవాడ గుడి విస్తరణ డిజైన్స్‌కు..శృంగేరి పీఠం అనుమతులు తీసుకోండి
దేవాదులను పదేండ్లు పట్టించుకోలేదు : పొంగులేటి
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను గత ప్రభుత్వం పదేండ్ల పాటు పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా 3వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టులకు తమ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ‘‘చత్తీస్ గఢ్, మన రాష్ట్రానికి మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆఫీసర్లను అక్కడికి పంపించాం. సమ్మక్క బ్యారేజీని త్వరలో ప్రారంభించి, స్టోరేజ్ చేసిన నీటిని లిఫ్ట్ చేస్తాం” అని తెలిపారు.
రైతుల కోసం ప్రాజెక్టులు కడతామని చెప్పి.. కేసీఆర్ వేల కోట్లు లూటీ చేసిండు. తెలంగాణ ప్రజల జీవితాలను తాకట్టు పెట్టి, కమీషన్ల కోసం తప్పుడు పనులు చేయించిండు. కాళేశ్వరం, పాలమూరు‒రంగారెడ్డి, దేవాదుల, సీతారామ.. ఇలా ఏ ప్రాజెక్ట్ చూసినా అవినీతిమయమే. కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకోవడానికే సరిపోయింది. కేసీఆర్ హయాంలో రూ.1.81 లక్షల కోట్లతో ఇరిగేషన్ పనులు చేస్తే, అందులో లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగింది. అదీకాక చేసిన పనులకు సంబంధించి రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టిన్రు.
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి