మంత్రి ఉత్తమ్ తండ్రి కన్నుమూత

మంత్రి ఉత్తమ్ తండ్రి కన్నుమూత
  • అనారోగ్యంతో కిమ్స్​లో తుదిశ్వాస విడిచిన పురుషోత్తం రెడ్డి
  • సీఎం నివాళి.. మంత్రులు, ప్రముఖుల సంతాపం
  • ఉత్తమ్​ను పరామర్శించిన పలువురు నేతలు

హైదరాబాద్, వెలుగు: మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి తండ్రి తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యం బాధ పడుతున్న ఉత్తమ్ తండ్రి నలమాద పురుషోత్తంరెడ్డి కొండాపూర్​లోని కిమ్స్​లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల వారి స్వగ్రామం. పురుషోత్తమ్​రెడ్డికి ఇద్దరు కుమారులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, గౌతమ్​రెడ్డి, ఒక కుమార్తె హితశ్రీరెడ్డి ఉన్నారు. ఆయన హైదరాబాద్ బీహెచ్ఈఎల్​లో జనరల్ మేనేజర్​గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మఠంపల్లి మండలంలోని సాగర్ సిమెంట్స్​లో ఈడీగా కూడా పనిచేశారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి కల్పించారు.

పురుషోత్తం రెడ్డి భౌతికకాయాన్ని సందర్శనార్థం కొండాపూర్​లోని సైబర్ మిడోస్​లో ఉన్న కూతురు ఇంటికి తీసుకెళ్లారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, శ్రీధర్​బాబు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అభిమానులు భారీగా తరలివచ్చి నివాళి అర్పించారు. అనంతరం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. 

సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలగడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి వెళ్లి పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉత్తమ్, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. పురుషోత్తమ్​ రెడ్డి యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. పురుషోత్తంరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఏపీ పీసీసీ చీఫ్ ​వైఎస్​ షర్మిల, కేంద్ర మంత్రి బండి సంజయ్ ​కుమార్, ఈటల రాజేందర్,​ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు.. ఉత్తమ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.