రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్

రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్

హైదరాబాద్: రేషన్ కార్డు దారులు, రైతులకు నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రేషన్ కార్డు దారులకు సన్నం బియ్యం పంపిణీపై కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 20) తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. భేటీ ముగిసిన అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు. 

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రేషన్ కార్డు దారులకు సన్నం బియ్యం పంపిణీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ నుండే రైతులకు సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని వెల్లడించారు. ఈ  సీజన్ నుండే ఎంఎస్‎పీకి అదనంగా రూ.500  చెల్లించి సన్నాలు కొంటామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‎లో 1.43 లక్షల టన్నుల పంట వస్తుందని అంచనా వేశారు. వచ్చే నెల నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. జనవరి నుండి అన్నీ రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.