ఎవరూ అధైర్యపడొద్దు..  రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపడతాం : ఉత్తమ్​కుమార్​రెడ్డి

  • నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పరిహారం చెల్లిస్తాం
  • ట్యాంక్ బండ్  డిజైన్ లోపం వల్లే తీవ్ర నష్టం 
  • డిజైన్​ మార్చాలని ఆనాడే చెప్పిన.. వినలే

మేళ్లచెరువు (హుజూర్‌నగర్) / మఠంపల్లి, వెలుగు : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం మంత్రి విస్తృతంగా పర్యటించారు. హుజూర్‌నగర్ పట్టణంలో దద్దనాల చెరువు, గండ్లుపడి తెగిపోయిన బూరుగ్గడ్డ గ్రామంలోని నల్లచెరువును పరిశీలించారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలతో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామన్నారు. పూర్తిగా ఇండ్లు కోల్పోయినవారికి కొత్తగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.

పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.10 వేలు ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు‌. పంట నష్టంపై అధికారుల నివేదిక అందగానే పరిహారం అందజేస్తామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలకు వెంటనే రిపేర్లు చేయిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్ ట్యాంక్ బండ్ డిజైన్​ లోపం వల్లే వరద ఈ స్థాయిలో వచ్చి తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ సమయంలోనే ప్లానింగ్ లోపం గురించి తను చెప్పానని, డిజైన్​ మార్చాలని సూచించినా ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ లోపం కారణంగానే వరద నీరు ఇండ్లలోకి వచ్చి చేరిందన్నారు. ఈ నష్టానికి కారణమైన ఏఈ శ్రీనివాస్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేయించాలని ఇరిగేషన్ సీఈ రమేశ్​బాబుకు చెప్పారు. 

డ్యాముల భద్రత, పూడికతీతకు చర్యలు..

దేశంలోని అన్ని రాష్ట్రాలకు డ్యాముల భద్రతపై నేషనల్ సైడ్మెంటేషన్ మేనేజ్​మెంట్ పాలసీని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసిందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. తనతోపాటు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు సబ్ కమిటీలో ఉన్నారని చెప్పారు. అంతకుముందు చౌటపల్లి గ్రామ చెరువు గండ్ల పడ్డ ప్రాంతాన్ని, ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు.

అనంతరం మఠంపల్లి మండల కేంద్రంలో ముంపునకు గురైన ఎస్సీ కాలనీవాసులకు సాగర్ సిమెంట్స్ యాజమాన్యం అందిస్తున్న బియ్యాన్ని మంత్రి బాధితులకు పంపిణీ చేశారు. రఘునాథపాలెం, గుండ్లపల్లి గ్రామాల్లో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ యాకూబ్ పాషా, ఆర్డీవో శ్రీనివాసులు, సీఐ చరమందరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, నాయకులు, అధికారులు ఉన్నారు. 

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే పద్మావతి భరోసా  

కోదాడ, వెలుగు : నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి భరోసా ఇచ్చారు. కోదాడ పట్టణం, అనంతగిరి, కోదాడ, చిలుకూరు మండలాల్లో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా వరదల కలిగిన నష్టాన్ని ప్రజలు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో కోతకు గురైన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలకు  పంట పొలాలు దెబ్బతిన్నాయని, రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేసి త్వరలో రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆమె వెంట నాయకులు, రైతులు పాల్గొన్నారు.