సీతారామ ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయండి:మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

సీతారామ ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేయండి:మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
  • భూసేకరణలో అలసత్వం  వద్దు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: సీతారామ ప్రాజెక్ట్​ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ కూడా వేగంగా కంప్లీట్ చేయాలన్నారు. జలసౌధలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి ఆయన సీతారామ ప్రాజెక్ట్​పై శుక్రవారం రివ్యూ చేశారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న సొరంగాలు, కాలువల నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భూసేకరణ విషయంలో అలసత్వం పనికిరాదు. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. పాలనాపరమైన అనుమతుల్లో ఆలస్యం కాకుండా చూసుకోవాలి. టెండర్లు, సాంకేతికపరమైన అంశాల్లో అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి. 

సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్​ను పూర్తి చేయాలి’’అని అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. రివ్యూ మీటింగ్​లో ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్​, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.