రెండున్నరేళ్లలో డిండిని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి

దేవరకొండ, వెలుగు: డిండి ఎత్తిపోతల పథకాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని సాయి శివ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌లో బాలునాయక్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పార్లమెంటరీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గంలోని ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ, నక్కలగండితో పాటు పెద్ద మునిగల్, కాసరాజుపల్లి, అక్కంపల్లి, వైజాగ్‌‌‌‌‌‌‌‌ కాలనీ, పోగిళ్ల లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లను రెండున్నరేళ్లలో పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 

నియోజకవర్గంలోని దళిత గిరిజనులకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా ఉన్నప్పుడు దేవరకొండ నియోజకవర్గానికి 10 వేల ఇండ్లు కేటాయించానని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పని అయిపోయిందన్నారు. బీజేపీకి మోదీ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ తప్ప పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీని ఏపీకి కేటాయించి తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. 

ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రఘువీర్‌‌‌‌‌‌‌‌కు రికార్డు స్థాయి మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీమంత్రి జానారెడ్డి, ఎంపీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ రఘువీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే జైవీర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.