ప్రతి ధాన్యం గింజ కొంటాం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి

  • యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినం: ఉత్తమ్ కుమార్​ రెడ్డి
  •  రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు సెంటర్లు
  •  సన్న, దొడ్డు వడ్లకు వేర్వేరు సెంటర్లని వెల్లడి
  •  సివిల్ సప్లయ్స్ అధికారులతో మంత్రి సమీక్ష 

హైదరాబాద్, వెలుగు: వానాకాలం వడ్లు కొనేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గింజ కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్​లో 2024–25 వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై యాక్షన్ ప్లాన్ కోసం సివిల్ సప్లయ్స్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ‘‘ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,496 సెంటర్లు, ఐకేపీ కేంద్రాల ద్వారా 2,102 సెంటర్లు, ఇతరుల ద్వారా 541 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఆశించిన మేరకు సన్నాల దిగుబడి వచ్చింది. 

రైతాంగాన్ని సన్నాల వైపు ప్రోత్సహించేందుకు వీలుగా రూ.500 బోనస్ ఇస్తాం. ఈ వానాకాలం నుంచే అమలు చేస్తాం. సన్న, దొడ్డు వడ్లు సేకరించేందుకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. కొనుగోళ్లలో అధికారుల పాత్ర కీలకంగా ఉంటది’’అని ఉత్తమ్ అన్నారు. 

కొనుగోళ్ల షెడ్యూల్ ప్రకటన 

వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన షెడ్యూల్​ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ మొదటి వారంలో నల్గొండ, మెదక్, రెండో వారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట్​లో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. అదేవిధంగా, మూడో వారంలో కరీంనగర్, జగిత్యాల, వరంగల్, జనగామ, సూర్యాపేట, మేడ్చల్ కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 

నాల్గో వారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో, నవంబర్ మొదటి వారంలో నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డిలో సెంటర్లు ప్రారంభమవుతాయని తెలిపారు. రెండో వారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కొనుగోళ్లు ఉంటాయన్నారు. నవంబర్ మూడో వారంలో భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో, నాల్గో వారంలో మహబూబాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొనుగోళ్లు షురూ అవుతాయని ఉత్తమ్ తెలిపారు.