
- రామప్ప సరస్సు నుంచి ధర్మసాగర్‌కు చేరుకున్న గోదావరి నీళ్లు
- 187 నుంచి 309 మీటర్ల ఎత్తుకి పంపింగ్
- టన్నెల్ ప్రారంభంతో 2.41 లక్షల ఎకరాలకు సాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఏండ్ల పాటు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న దేవాదుల ఫేజ్ 3 ఎట్టకేలకు ప్రారంభమైంది. దీంతో రైతన్నల పదిహేడేండ్ల ఎదురుచూపులకు తెర పడింది. దేవన్నపేట పంప్ హౌస్ వద్ద మంత్రులు ఉత్తమ్, పొంగులేటి కలిసి మోటార్ ను ప్రారంభించడంతో రామప్ప సరస్సు వద్ద 187 మీటర్ల ఎత్తు నుంచి 309 మీటర్ల ఎత్తులో ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి నీటిని లిఫ్ట్ చేయడం మొదలైంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.41 లక్షల ఎకరాలకు సాగునీరు, వరంగల్ ట్రైసిటీస్‌తో పాటు వందలాది గ్రామాలకు తాగునీరు అందనుంది.
2008లో మొదలైన మూడో దశ పనులు
జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ద్వారా 38.18 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి 6.21 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఇందులో 5.57 లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా మిగిలిన 64 వేల ఎకరాలకు చెరువుల కింద నీటిని అందించాలి. జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి ఏపీలో 2008లో అప్పటి సీఎం వైఎస్‌ఆర్ హయాంలో దేవాదుల మూడోదశ పనులు ప్రారంభమయ్యాయి. రూ.5,789 కోట్లతో చేపట్టే పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించారు. 2004లోనే దేవాదుల ఫస్ట్, సెకండ్ ఫేజ్ పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టారు.
మొదటి దశ కింద ఏటూరునాగారం మండలంలోని దేవాదుల దగ్గర గోదావరి తీరంలో పంప్‌హౌస్ నిర్మించి 10 మోటార్లు అమర్చారు. తొలిదశలో దేవాదుల నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఆర్‌ఎస్ ఘన్‌పూర్ రిజర్వాయర్ వరకు రూ.844 కోట్లతో, రెండో దశలో దేవాదుల నుంచి తపాస్‌పల్లి వరకు రూ.1,820 కోట్లతో పైప్‌లైన్ పనులు చేపట్టారు. ఫస్ట్, సెకండ్ ఫేజ్ పనుల కారణంగా 12 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం దక్కింది. మూడో దశ కింద 25.15 టీఎంసీలను లిఫ్ట్ చేయాల్సి ఉండగా పనులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పడ్డాయి.
అనేక అడ్డంకులు అధిగమించి..
దేవాదుల మూడో దశ పనులకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ పనులను ఎనిమిది ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజీలో రూ.1,398 కోట్లతో దేవాదుల నుంచి భీంఘన్‌పూర్ వరకు మూడు వరుసల పైప్‌లైన్, రెండో ప్యాకేజీలో రూ.531 కోట్లతో భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు టన్నెల్, మూడో ప్యాకేజీలో రూ.1,410 కోట్లతో రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు టన్నెల్, నాలుగో ప్యాకేజీలో రూ.855 కోట్లతో ధర్మసాగర్ నుంచి ఆర్‌ఎస్ ఘన్‌పూర్ వరకు టన్నెల్, ఐదో ప్యాకేజీలో రూ.305 కోట్లతో నర్సంపేట, నల్లబెల్లి ఏరియాలోని రంగాయ, ఎర్రాయచెరువుకు పైప్‌లైన్, ఆరో ప్యాకేజీలో రూ.325 కోట్లతో నష్కల్, ఆలేరు వాగు, పాలకుర్తి, చెన్నూర్ రిజర్వాయర్ల నిర్మాణం, ఏడో ప్యాకేజీలో రూ.260 కోట్లతో యశ్వంతపూర్ వాగు, నవాబుపేట, లింగాలఘణపురం రిజర్వాయర్, ఎనిమిదో ప్యాకేజీలో రూ.323 కోట్లతో లద్నూర్, కన్నెబోయినగూడెం, ఐనాపూర్ పెద్ద చెరువు, మారెడ్డి చెరువు రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలుపెట్టారు. అయితే ప్యాకేజీ 2 కింద భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు చేపట్టిన టన్నెల్ పనులకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
భూగర్భంలో బాంబు పేలుళ్ల కారణంగా రామప్ప ఆలయానికి ముప్పు ఉందని అక్కడి ప్రజలు పోరాటం చేశారు. ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్‌లు వచ్చి పరీక్షించి టెంపుల్‌కు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా పట్టువిడవలేదు. దీంతో పనులు ఆగిపోయాయి. చివరికి ప్రభుత్వమే దిగొచ్చి భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు చేపట్టిన టన్నెల్‌ను రద్దు చేసి మూడు వరుసల పైప్‌లైన్ నిర్మించింది. దీనివల్ల అదనంగా రూ.600కోట్లకు పైగా భారం పడింది.
మూడో ప్యాకేజీలో భాగంగా రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు 54.88 కిలోమీటర్ల దూరం ఆరు మీటర్ల వ్యాసార్థంతో టన్నెల్ తవ్వాలి. ఈ పనుల కోసం పది ఆడిట్ పాయింట్లు, రెండు షాఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఏకకాలంలో ఒక్కో ఆడిట్‌పాయింట్ నుంచి అటు 2.5 కిలోమీటర్లు, ఇటు 2.5 కిలోమీటర్ల చొప్పున తవ్వుకుంటూ పోయారు.
పనులు మొదలైన రెండేండ్ల తర్వాత 2011 జూలైలో వసంతాపూర్ ఆడిట్ పాయింట్ వద్ద చలివాగు ప్రాజెక్ట్ కింద టన్నెల్‌కు బుంగపడి నీటితో నిండిపోయింది. ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోగా, పనులు ఏండ్ల పాటు నిలిచిపోయాయి. సబ్‌లీజ్‌పై పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ దివాళా తీసింది. అప్పటికి 31.35 కిలోమీటర్ల సొరంగం తవ్వి 2.55 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ సర్కార్ రామప్ప – ధర్మసాగర్ టన్నెల్‌ను 49.06 కిలోమీటర్లకు కుదించారు. కొత్తగా 3.983 కిలోమీటర్ల దూరం అప్రోచ్ కెనాల్, 6.86 కిలోమీటర్ల దూరం మూడు మీటర్ల వ్యాసార్థం కలిగిన మూడు పైప్‌లైన్ల నిర్మాణం, పంప్‌హౌజ్, సర్జ్‌పూల్, 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు అమర్చడం వంటి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఎస్టిమేషన్‌ను రూ.1,490 కోట్లకు పెంచారు. మేఘా సంస్థకు పనులు అప్పగిస్తూ అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద రూ.50 కోట్లు ఇచ్చినా పనులు మాత్రం పూర్తి కాలేదు. అలాగే ఐదో ప్యాకేజీలో చేపట్టిన పనులను రద్దు చేసి ఈ నిధులతోనే రామప్ప సరస్సు దగ్గర పంప్‌హౌస్ నిర్మించి పాకాల చెరువుకు కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.
17 ఏండ్ల తర్వాత గోదావరి నీళ్ల లిఫ్టింగ్
దేవాదుల మూడో దశ మూడో ప్యాకేజీ కింద చేపట్టిన రామప్ప – ధర్మసాగర్ టన్నెల్ వర్క్ ఎట్టకేలకు 17 ఏండ్ల తర్వాత పూర్తయింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత దేవాదులను తొలి ప్రాధాన్యత లిస్ట్‌లో చేర్చి పనులు స్పీడప్ చేశారు. ఏడాదిన్నరలోపే టన్నెల్ పనులను పూర్తి చేసి గోదావరి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు.
హనుమకొండ జిల్లా దేవన్నపేట పంప్‌హౌజ్ దగ్గర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మోటార్ ఆన్ చేసి టన్నెల్‌లో ఉన్న నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2.41 లక్షల ఎకరాలకు సాగు నీరు, వరంగల్ ట్రైసిటీస్‌తో పాటు పలు గ్రామాల ప్రజలకు తాగునీరు అందనుంది.
187 నుంచి 309 మీటర్ల ఎత్తుకి లిఫ్టింగ్
రామప్ప సరస్సు దగ్గర 187 మీటర్ల లెవల్‌లో గోదావరి నీళ్లు ఉంటాయి. సరస్సు నుంచి టన్నెల్ ఇన్‌లెట్ వరకు చేరుకోవడానికి 3.96 కిలోమీటర్ల దూరం గ్రావిటీ కెనాల్ తవ్వారు. ములుగు జిల్లాలోని బండారుపల్లి గ్రామానికి సమీపంలో 14 మీటర్లు డౌన్‌ఫాల్ ఉండేలా పనులు చేసి ఇన్‌లెట్ పోర్టల్ గేట్ అమర్చారు. గేట్ ఎత్తిన వెంటనే గ్రావిటీ ద్వారా 49 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవన్నపేట సర్జ్‌పూల్‌కు నీళ్లు చేరుతాయి. సర్జ్‌పూల్ వాటర్ లెవల్ 152 మీటర్లు ఉంటుంది.
సర్జ్‌పూల్ నుంచి పంప్‌హౌజ్ వరకు 53 మీటర్ల దూరం ఉండగా ఇక్కడ మూడు డ్రాఫ్ట్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మించి వేర్వేరుగా గేట్లు, 31 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు అమర్చారు. గేట్లను తెరిచి మోటార్లను స్టార్ట్ చేయగానే ఆరు కిలోమీటర్ల దూరంలో 309 మీటర్ల ఎత్తులో ఉన్న ధర్మసాగర్ రిజర్వాయర్‌కు పైప్‌లైన్ ద్వారా నీళ్లు చేరుతాయి. ఇక ఇక్కడి నుంచి ప్యాకేజీల వారీగా సాగు, తాగు నీటి కోసం ఉపయోగించుకుంటారు. దేవాదుల లిఫ్ట్ స్కీమ్ ద్వారా ప్రతీ యేటా 170 రోజుల పాటు మోటార్లను వినియోగిస్తే 38.18 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చు.
ఏడాది పొడవునా నీటి లిఫ్టింగ్‌కు వీలుగా బీఆర్‌ఎస్ సర్కార్ గోదావరిపై ఆరు టీఎంసీల కెపాసిటీతో కన్నాయిగూడెం మండలంలో తుపాకుల గూడెం (సమ్మక్క సాగర్) బ్యారేజీ నిర్మించింది. దేవాదుల ద్వారా 60 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ యేటా వ్యవసాయ అవసరాలకు 56.71 టీఎంసీలు, తాగునీటి కోసం 2.97, పరిశ్రమలకు 0.032 టీఎంసీల నీటిని కేటాయించింది.