తాగునీటి సమస్య రానివ్వొద్దు : ఉత్తమ్ కుమార్ రెడ్డి 

  •     నిధులు ఇస్తా..బోర్లను రిపేర్లు చేయండి
  •     పులిచింత బ్యాక్‌ వాటర్‌‌ నుంచి పైప్‌ లైన్లు వేయండి
  •     2,160 ఇండ్లను 5 నెలల్లో లబ్ధిదారులకు ఇస్తాం
  •     ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట, హుజూర్‌‌నగర్‌‌, కోదాడ, వెలుగు : తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అధికారులను ఆదేశించారు.  బోర్లను రిపేరు చేసి ట్యాంకర్‌‌ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అవసరమైన నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. పులిచింతల బ్యాక్ వాటర్‌‌ను మోటర్లతో పైప్ లైన్ల ద్వారా కృష్ణా పరివాహక గ్రామాలకు సరఫరా చేయాలని సూచించారు.  శనివారం హుజూర్ నగర్‌లో టౌన్ హాల్‌, మోడల్ కాలనీలో జరుగుతున్న ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌లో నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ వెంకట్‌రావుతో కలిసి రివ్యూ నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వేసవిలో ఆర్‌‌డబ్ల్యూఎస్‌, మిషన్ భగీరథ,  పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,  తాగునీటితో పాటు ఉపాధి హామీ పనులపై ఫోకస్‌ చేయాలన్నారు.   ఈ నెల 11 వరకు కొత్త పనులు మంజూరు చేయాలని డీఆర్‌‌డీవోను ఆదేశించారు.  టౌన్‌ హాల్‌కు కేటాయించిన రూ. కోటితో ప్రహరీ , వంటశాల, పార్కింగ్‌తో, మొదటి అంతస్తులో కొత్త సౌండ్ సిస్టం తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు.  పట్టణంలోని మెయిన్ రోడ్ లో జరుగుతున్న పైప్ లైన్, రోడ్డు పనులతో పాటు  లైబ్రరీ బిల్డింగ్ పనులను స్పీడప్ చేయాలన్నారు.  

స్టేట్‌ అర్బన్ డెవపల్‌మెంట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మంజూరైన రూ.5.5 కోట్లతో లింగగిరి క్రాస్ రోడ్ నుంచి మట్టపల్లి జంక్షన్ వరకు డబుల్ రోడ్ పనులు ప్రారంభించామని, త్వరలోనే సెంట్రల్ లైటింగ్‌ సిస్టం కూడా ఏర్పాటు చేస్తామని  చెప్పారు.  ఏరియా ఆస్పత్రిలో రూ 2.25 కోట్లతో సిటీ స్కాన్ మిషన్ , ఇతర పరికరాలు మంజూరయ్యాయని, త్వరలోనే వాటిని  అందుబాటులోకి తెస్తామన్నారు.  రామస్వామి గట్టు మోడల్ కాలనీలోని 2,160 ఇండ్లను 5 నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని  హామీ ఇచ్చారు.

హుజూర్‌‌నగర్‌‌తో పాటు కోదాడ  నియోజక వర్గాల్లో  లిఫ్టుల రిపేర్లకు నిధులు మంజూరు చేశామని, వ్యవసాయానికి నీటి సమస్య  రాకుండా చూడాలన్నారు.  కోర్టు కాంప్లెక్స్ కోసం 5 ఎకరాలు కావాలని బార్ అసోసియేషన్ సభ్యులు  కోరుతున్నారని వారికి అనువైన స్థలాన్ని పరిశీలించాలని  ఆర్డీవో శ్రీనివాస్ ను   ఆదేశించారు. అనంతరం రామస్వామి గుట్ట వద్ద క్రిస్టియన్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి..  రూ. 50 లక్షలతో చేపట్టబోయే పనులపై సమీక్షించారు.  

అనంతరం కోదాడ పట్టణంలోని నూతనంగా నిర్మించిన రామాలయంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేశ్‌తో కలిసి పూజలు చేశారు. అనంతరం షాదీఖానా, ఈద్గాల అభివృద్ధికి మంజూరైన రూ.5 కోట్లతో చేపట్టాల్సిన పనులపై స్థానిక ముస్లిం నాయకులు, మత పెద్దలతో సమావేశం నిర్వహించారు.  

వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం

ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించనున్న సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్‌ స్థలాన్ని శనివారం ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే మందుల సామెల్, మాజీ మంత్రి రామిరెడ్డి దామోదద్‌ రెడ్డి,  కలెక్టర్ వెంకట్‌రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం  జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సువెన్ ఫార్మా సహకారంతో ఏర్పాటు చేసిన  భరోసా సెంటర్‌‌ను  ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..  

అన్ని ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నామన్నారు.  సూపర్ స్పెషలిటీ, టీచింగ్ ఆస్పత్రికి రూ.190.50 కోట్లు మంజూరు చేశామని, పనులు వెంటనే మొదలుపెట్టాలని  సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్‌‌ను ఆదేశించారు.  మహిళ రక్షణ చట్టాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని పోలీసుకుల సూచించారు.  మహిళల, బాలలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.  గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించాలని,  సూర్యాపేటను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.  

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకారం అందించాలని సువెన్ ఫార్మా ప్రతినిధులను కోరారు.  సూర్యాపేట టౌన్‌లో గతంలో  రూ.48లక్షల ఎంపీ నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండానే బిల్లులు చెల్లించారని, సదరు ఏజెన్సీపై ఎంక్వైరీ  కలెక్టర్‌‌ను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే,  అడిషన్‌ ఎస్పీలు నాగేశ్వర రావు, జనార్ధన్ రెడ్డి, డీడబ్ల్యూవో వెంకటరమణ, డీసీపీవో రవి కుమార్, నేతలు చెవిటి వెంకన్న, వేనారెడ్డి పాల్గొన్నారు.