- కోదాడ నియోజకవర్గంలో రూ.124 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
మునగాల, కోదాడ, వెలుగు : యువతకు ఉపాధి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, వారి కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మునగాల మండలం ఆకుపాములలో రూ.10 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఈ స్కిల్స్ సెంటర్ నిరుద్యోగ యువతకు మార్గదర్శిగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఈ స్కిల్స్ సెంటర్ మంజూరుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు.
ఈ సెంటర్లో నిరుద్యోగులకు అన్నిరంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి బోటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. భవనాన్ని నాణ్యత ప్రమాణాలతో త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవేపై ఉన్నందున భవనం ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంటుందన్నారు. దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని
సూచించారు.
ప్రజలకు మెరుగైన రోడ్లు..
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, నిర్మాణం పూర్తయితే ప్రజల ఆస్తుల ధరలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కోదాడ సమగ్ర అభివృద్ధే లక్ష్యం..
కోదాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. 10 నెలల్లోనే వందల కోట్ల రూపాయలు కోదాడ నియోజకవర్గానికి మంజూరు చేయించానని తెలిపారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యంతోపాటు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించానని చెప్పారు. కోదాడ నియోజకవర్గాన్ని రాష్ట్రాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు.
అనంతరం పలు గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ను సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ రాజిరెడ్డి, జిల్లా డైరెక్టర్ రమేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మాజీ చైర్మన్ చింతకుంట లక్ష్మీనారాయణరెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేశ్ దీన్ దయాల్, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.