నేరేడుచర్ల/ హుజూర్ నగర్, వెలుగు : దేశంలో తొలిసారి వ్యవసాయ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం నేరేడుచర్ల పట్టణం, మండంలో రూ.18.57 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం కల్లూరు గ్రామంలో రాష్ట్ర గ్రామీణ స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి వ్యక్తికి నెలకు 6 కేజీల సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు. పేదలందరికీ విడుతలవారీగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు.
సంక్షేమ పథకాలు, సామజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం తమకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంత్రిని నేరేడుచర్ల ప్రింట్ మీడియా విలేకరులు కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఐఎన్టీయూసీ వార్షిక ప్రగతిని తెలిపే క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు.
ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, హుజూర్ నగర్ ఇన్చార్జి ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, వైస్ చైర్మన్ సరితాసైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయలక్ష్మీనరసింహరావు, వైస్ చైర్మన్ సురేశ్ రెడ్డి, ఐఎన్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగన్నగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి, నేరేడుచర్ల మండల, పట్టణ అధ్యక్షులు కొనతం చిన్న వెంకటరెడ్డి, నూకల సందీప్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.