పీసీసీ రేసులో లేను: ఉత్తమ్ కుమార్రెడ్డి

  • = వరద వస్తే మేడిగడ్డ గేట్లు ఎత్తినం
  • = దానికి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతుండు
  • = కట్టింది వాళ్లే.. కూలింది వాళ్ల టైంలోనే..
  • 99% ఇళ్ల కు నల్లాలు ఇచ్చామన్నది అబద్ధం
  • రేషన్ కార్డులిస్తం.. రైతుబంధు ఆగదు
  • 6 నెలల్లో 31 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినం
  • పదేండ్లలో కేసీఆర్ 21 వేల కోట్లు మాఫీ చేసిండ్రు
  • పార్లమెంట్ సెషన్ తర్వాతే రాహుల్ సభ?
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్

హైదరాబాద్: తనకు పీసీసీ చీఫ్​ పదవి వద్దని మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఆ రేసులో లేనని అన్నారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేశారు. పార్లమెంటు సెషన్ పూర్తయ్యాకే వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఉండొచ్చని చెప్పారు. ఇవాళ మంత్రి ఉత్తమ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.  మోదీ కార్పొరేట్లకు సంబంధించిన 14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని, తాము ఆరు నెలల్లో 31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. 

పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కేవలం 21 వేల కోట్ల రుణాలే మాఫీ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఉత్తమ్ ధన్యవాదాలు తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఎత్తడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని, వరద వచ్చినందునే గేట్లు ఎత్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

Also Read:-తెలంగాణ పేరే ఎత్తలే

కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాళ్లే.. కూలింది కూడా వాళ్ల టైంలోనన్నారు. మిషన్ భగీరథ ద్వారా  99% ఇండ్లకు నల్లాలు ఇచ్చామన్నది అబద్ధమని చెప్పారు. పదేండ్ల నుంచి జల్ జీవన్ కింద నిధులు రాలేదని, కేంద్ర మంత్రి  సి ఆర్ పాటిల్ ను నిధులు అడిగినట్టు చెప్పారు. 

రేషన్ కోసమే రేషన్ కార్డులు

రేషన్ కార్డులు కేవలం నిత్యావసర సరుకుల కోసమే ఇస్తామని మంత్రి స్ఫష్టం చేశారు. ఈ అసెంబ్లీ సెషన్ లోనే రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అంశాలపై గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు. ఇందుకోసం కేబినెట్  సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. పదేండ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య పరీ క్షల కోసం ప్రత్యేకంగా వేరే కార్డులు ఉంటాయని స్పష్టం చేశారు.