
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న ప్రాజెక్టులపై తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టుల నిర్మాణంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టులతో తెలంగాణకు నష్టం జరుగుతుందని.. ఈ ప్రాజెక్టుల వల్ల తెలంగాణలో సాగు, తాగు నీటికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.
గోదావరి ట్రైబ్యునల్ ఉత్తర్వులు, విభజన చట్టాన్ని ఏపీ ఉల్లంఘిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని ఆరోపించారు. నదీ యాజమాన్య బోర్డుల పర్మిషన్ లేకుండానే ప్రాజెక్టులు చేపడుతున్నారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే అభ్యంతరం తెలిపామని.. ఏపీ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తోందని కేంద్ర నిపుణుల కమిటీ కూడా చెప్పిందని పేర్కొన్నారు.
అయినప్పటికీ ఏపీ పరోక్ష మార్గాల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వ చర్యలను తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉరుకోదని తేల్చిచెప్పారు. ఏపీ సర్కార్ ఏకపక్షంగా నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కాగా, బనకచర్ల ప్రాజెక్టును వేగంగా నిర్మించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.