
- ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోం
- గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు
- సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ అనుమతులూ తీసుకోలే
- భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన
- జలసౌధలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి
- త్వరలోనే లీగల్ ఎక్స్‌పర్ట్స్, అడ్వకేట్‌జనరల్, ఇరిగేషన్ అడ్వకేట్లతో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ లిఫ్ట్, రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ నిర్ణయించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు త్వరలోనే ఇరిగేషన్ శాఖ అడ్వకేట్లు, లీగల్ఎక్స్పర్ట్స్, అడ్వకేట్ జనరల్‌తో సమావేశమై.. అందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించనుంది. జీబీ లింక్ ప్రాజెక్టును ఒకట్రెండు నెలల్లో గ్రౌండ్చేసి టెండర్లనూ పిలిచేందుకు ఏపీ సిద్ధమవుతుండడంతో శుక్రవారం జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టులపై చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోబోమని, కోర్టులోనే తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏపీ ఈ రెండు ప్రాజెక్టులను చేపడుతున్నది. ప్రస్తుతం ఉన్న నీటి ఒప్పందాలను ఉల్లంఘించింది. దీని వల్ల రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగు నీటి అవసరాలకు పెను నష్టం వాటిల్లుతుంది.
ఏపీ ఆయా ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులను తీసుకోకుండానే పనులు మొదలుపెట్టింది. కృష్ణా, గోదావరి నదుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడుతాం” అని తెలిపారు. ముఖ్యంగా ఏపీ చేపడుతున్న జీబీ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు భారీ గండి పడుతుందని పేర్కొన్నారు. ‘‘1980లో గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) అవార్డు, ఏపీ విభజన చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీ బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. సెంట్రల్ వాటర్‌కమిషన్(సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నుంచి అనుమతులు కూడా తీసుకోలేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం విభజన చట్టంలో పేర్కొన్న 46 (2), 46 (3) సెక్షన్లను అడ్డుపెట్టుకుని.. జీబీ లింక్ ప్రాజెక్టుకు కేంద్ర నిధులను పొందేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నది. కానీ అనుమతులు లేకుండా, పర్యావరణానికి నష్టం చేసేలా ఏ ప్రాజెక్టునూ చేపట్టేందుకు అధికారం లేదు’’ అని చెప్పారు.
‘రాయలసీమ’ పూర్తి చేసేందుకు కుట్రలు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌నూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ తేల్చి చెప్పారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశామని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్పర్ట్అప్రైజల్కమిటీ (ఈఏసీ).. రాయలసీమ ప్రాజెక్టులో చేపట్టిన పనులను ఆపేసి అక్కడి ప్రాంతాన్ని యథాతథ స్థితికి తీసుకురావాలని, ప్రాజెక్టు పనులను చేపట్టడానికి ముందు ఉన్న పరిస్థితులను రీస్టోర్ చేయాలని ఫిబ్రవరిలో ఏపీని ఆదేశించిందన్నారు. ‘‘పర్యావరణ నిబంధనలను ఏపీ ఉల్లంఘించిందని ఈఏసీ స్పష్టం చేసింది. ప్రాజెక్టు స్థలాన్ని పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు తీసుకున్న చర్యలు, దానికి సంబంధించిన ఫొటో ఆధారాలు సమర్పించి.. మళ్లీ పర్యావరణ అనుమతులకు అప్లై చేసుకోవాలని ఆదేశించింది. నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, కేంద్ర పర్యావరణ శాఖ ముందు తెలంగాణ చేసిన రిప్రెజెంటేషన్లను పరిగణనలోకి తీసుకున్నాక ఈఏసీ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇది పాక్షిక విజయమే. అయితే, ఏపీ మాత్రం ఇతర మార్గాల్లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కుట్రలు చేస్తున్నది’’ అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతం..
కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన ఒక్క నీటి బొట్టునూ వదిలిపెట్టబోమని, ఏపీ అక్రమ తరలింపులకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఉన్న వాస్తవాలు, చట్టం, రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కుల ఆధారంగానే సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతామని తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటి ప్రయోజనాలు, రైతులు, భావి తరాల ప్రయోజనాలను కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోయేలా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పెంచుకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోలేదని ఆరోపించారు. కాగా, ప్రాజెక్టుల్లోని ఒక్క నీటి బొట్టు కూడా వృథా చేయొద్దని, నీటిని సమర్థంగా వాడుకోవాలని అధికారులకు ఉత్తమ్ సూచించారు. ప్రాజెక్టుల్లో పూడిక తీసేందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు.
భద్రాచలానికి ముంపు ముప్పు..
ఏపీ పోలవరం నుంచి రాయలసీమకు నీటిని తరలిస్తే.. గోదావరి తీరంలోనే ఉన్న టెంపుల్ టౌన్ భద్రాచలం మునిగి పోతుందని మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం భద్రతకు పెను ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. భారీ మొత్తంలో నీటిని డైవర్ట్ చేస్తే.. దిగువన సహజ వరద ప్రవాహంపై ప్రభావం పడుతుం దని, దానితో భద్రాచలానికి ముప్పు వాటిల్లు తుందని చెప్పారు. భవిష్యత్తులో వచ్చే వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడేందుకు గానూ ఆ టౌన్ చుట్టూ ప్రొటెక్షన్ వాల్ నిర్మించేందుకు కేంద్ర సాయం తీసుకుంటా మని తెలిపారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని, వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. అనవసర జాప్యం చేసి పనులను పెండింగ్‌లో పెట్టొద్దని, వేగంగా సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.