రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. SLBC టన్నెల్ ఘటనపై మంత్రి ఉత్తమ్

రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. SLBC టన్నెల్ ఘటనపై మంత్రి ఉత్తమ్

నాగర్ కర్నూల్/మహబూబ్ నగర్/ అమ్రాబాద్: SLBC టన్నెల్ దుర్ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టన్నెల్లో పూర్తి స్థాయి డీవాటరింగ్ చేస్తామని, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి టీబీఎం అవశేషాలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. నిపుణులైన రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి కార్యాచరణ రూపొందించామని, రెస్క్యూ టీంలను లోపలికి పంపి రెండు రోజుల్లో సహాయక చర్యలు పూర్తి  చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రకటించారు. SLBCలో ఆపరేషన్‌ చివరి దశకు వచ్చిందని, గల్లంతైన వారి కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, పూర్తిగా నీళ్లను తోడేయాలని తెలిపారు.

ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ఇరిగేష న్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ప్రమాదం జరిగిన చోటు చాలా క్లిష్టమైందని తెలిపారు. కన్వేయర్ బెల్ట్కు రిపేర్లు చేస్తున్నారని, బుధవారం రాత్రి వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇది అందుబాటులోకి వస్తే గంటకు 800 క్యూబిక్​ మీటర్ల బురదను బయటికి తీసే వీలుందని చెప్పారు. టన్నెల్లో గంటకు 3,600 నుంచి 5 వేల లీటర్ల ఊట నీరు వస్తున్నదని తెలిపారు. నీటితో పాటు బురదను బయటికి తీయడానికి సపరేట్ పైపులైన్ను వినియోగించనున్నట్టు చెప్పారు.

టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు మంత్రి ఉత్తమ్​ చెప్పారు. బోర్డర్​రోడ్స్​ఆర్గనైజేషన్​చీఫ్, టన్నెల్ రోడ్ల నిర్మాణంలో అనుభవం ఉన్న జనరల్​ హర్పాల్​సింగ్తో మాట్లాడామని తెలిపారు. సహాయక చర్యలపై ఎల్​అండ్​టీ సంస్థకు చెందిన క్రిస్​ కూపర్, ఇతర సంస్థల నిపుణులతో చర్చించి సహాయక చర్యలను ప్రభుత్వ కార్యదర్శి అర్వింద్​ కుమార్​ కోఆర్డినేట్​చేస్తారని వివరించారు. వీరికి తోడుగా నేషనల్​రిమోట్​ సెన్సింగ్​ ఏజెన్సీ, నేషనల్​ జియోగ్రాఫికల్​ రీసెర్చ్​ ఏజెన్సీ, బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​ ప్రతినిధులు పరిశీలిస్తారన్నారు. 24 గంటలు 3 షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు.

ప్రమాదం జరిగిన శనివారం నుంచి ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలం వద్దే ఉంటున్నారు. ఆదివారం మంత్రి జూపల్లి సాహసం చేసి రెస్క్యూ టీమ్స్​తో కలిసి టన్నెల్ లోపలికి వెళ్లారు. దాదాపు 5 గంటల పాటు అక్కడే ఉన్న ఆయన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో బయటకు తిరిగొచ్చారు. మంత్రి ఉత్తమ్​ కూడా సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, రెస్య్కూ టీమ్స్తో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే, ఇతర ప్రాంతాలకు చెందిన టన్నెల్​ నిర్మాణ సంస్థలతో ఘటనపై చర్చించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. 

ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి 2 రోజులుగా ఘటన ప్రాంతంలోనే ఉంటున్నారు. సహచర మంత్రులతో కలిసి ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం రేవంత్​ రెడ్డికి వివరిస్తూ.. ఆయన ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం ఉదయమే చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రెస్క్యూ ఆపరేషన్​ను స్వయంగా పరిశీలించడంతోపాటు అధికారులతో రివ్యూ నిర్వహించారు.