మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులను అంగీకరిస్తాం: మంత్రి ఉత్తమ్

మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులను అంగీకరిస్తాం: మంత్రి ఉత్తమ్

న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్‎లో ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుంటోందని.. ఆంధ్రప్రదేశ్‎కు కేటాయించిన జలాలకంటే ఎక్కువగా వాడుకుంటోందన్నారు. సోమవారం (మార్చి 3) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‎తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా జలాలు, పలు ప్రాజెక్టులకు అనుమతులపై కేంద్రమంత్రితో చర్చించారు. ఈ భేటీ అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.

ALSO READ | కృష్ణా జలాల్నిఏపీ అక్రమంగా వాడుకుంటోంది: సీఎం రేవంత్

కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన దానికంటే ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోవాలని కేంద్రానికి చెప్పామని.. తప్పని సరిగా జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే.. ఏపీ ప్రభుత్వం చేపడుతోన్న బనకచర్ల ప్రాజెక్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేశామని తెలిపారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని.. మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం చెపుతోందని ప్రశ్నించారు. 

కృష్ణా, గోదావరి జలాల్లో మాకు కేటాయింపులు జరిగిన తర్వాతే వాళ్ల ప్రాజెక్టులను అంగీకరిస్తామని తేల్చి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి డీపీఆర్ ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదని కేంద్రమంత్రి చెప్పారనన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయింపుల పెంపుపైనా మంత్రితో చర్చించామని తెలిపారు. అలాగే.. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులకు కేంద్రాన్ని నిధులు ఇవ్వాలని అడిగామన్నారు. 

మొత్తం ఐదు ప్రాజెక్ట్‎లకు నిధులు ఇవ్వాలని కోరామని చెప్పారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులపై టెలిమెట్రీలను త్వరగా ఏర్పాటు చేయాలని అడిగాం.. టెలిమెట్రీల ఏర్పాటుకు అవసరమైతే ఏపీ వాటా భరిస్తామని చెప్పామని పేర్కొన్నారు. దీంతో పాటుగా కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరామని చెప్పారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు త్వరగా ఇస్తే.. బ్యారేజ్ కుంగడానికి బాధ్యులైన వారిపై మేం చర్యలు చేపడతామని అన్నారు.