దేవాదుల థర్డ్ ఫేజ్ ప్రారంభం..ధర్మసాగర్​కు చేరిన గోదావరి నీళ్లు

దేవాదుల థర్డ్ ఫేజ్ ప్రారంభం..ధర్మసాగర్​కు చేరిన గోదావరి నీళ్లు
  • దేవన్నపేట పంప్​హౌస్ స్విచ్​ ఆన్ చేసిన మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
  • ధర్మసాగర్​కు చేరిన గోదావరి నీళ్లు
  • పది రోజులు అక్కడే ఉండి అడ్డంకులు 
  • తొలగించిన ఆస్ట్రియా ఇంజినీర్లు, అధికారులు
  • 60 వేల ఎకరాలకు సాగునీరు విడుదల

హనుమకొండ/ వరంగల్/ ధర్మసాగర్, వెలుగు: దేవాదుల ప్రాజెక్టు థర్డ్ ఫేజ్​లో నిర్మించిన దేవన్నపేట పంప్ హౌస్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు చేరాయి. దేవన్నపేట పంప్ హౌస్ లోని మూడు మోటార్లలో ఒకటి ఓపెనింగ్ కు రెడీ కాగా.. దాదాపు పది రోజులపాటు పంప్ హౌస్ లో తలెత్తిన సాంకేతిక లోపాలను సరి చేసి గురువారం తెల్లవారుజామున ఆఫీసర్లు ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో గురువారం సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారికంగా పంప్ హౌస్ ను ప్రారంభించారు. మంత్రులు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్​లో దేవన్నపేటకు చేరుకుని పంప్ హౌస్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి మోటార్ ను ప్రారంభించిన మంత్రులు పంప్ హౌస్ నుంచి పరుగులు పెట్టిన గోదావరి నీళ్లకు సారె సమర్పించారు. ఆ తర్వాత స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని 60 వేల ఎకరాలకు సాగు నీటిని విడుదల చేశారు.

పది రోజులుగా ఎదురుచూపులు

దేవాదుల థర్డ్ ఫేజ్ కింద రామప్ప చెరువు నుంచి హసన్ పర్తి మండలం దేవన్నపేట వరకు రూ.1,494 కోట్లతో 49.06 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణం పూర్తి కాగా.. దాని ద్వారా జనగామ, వరంగల్ జిల్లాలోని ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. దేవన్నపేట పంప్ హౌస్​లో ఒక మోటార్ ను ఆన్ చేసి సాగునీటిని అందించాలని భావించింది. ఈ మేరకు ఈ నెల 18న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవన్నపేట పంప్ హౌస్​లో మోటార్ ఆన్ చేసే ప్రయత్నం చేశారు. పంపింగ్ వ్యవస్థలో లోపాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు ఏర్పాటు చేసిన ‘స్కాడా’ సిస్టంలో సమస్యలు రాగా నీటి విడుదల సాధ్యం కాలేదు. అదేరోజు మోటార్లు ఏర్పాటు చేసిన ఆస్ట్రియాకు చెందిన ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజనీర్లు చేరుకుని సమస్యను పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రులు అర్ధరాత్రి వరకు ఎదురు చూసి తిరిగివెళ్లిపోయారు.

ఆఫీసర్లంతా అక్కడే మకాం

సమస్యను వేగంగా పరిష్కరించి నీళ్లు పంప్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆండ్రిట్జ్ కంపెనీ ఇంజినీర్లు సోమవారం నాటికే స్కాడా లోపాలను సవరించారు. ఇరిగేషన్ ఆఫీసర్లు మంగళవారం నాడే ట్రయల్ రన్ చేయాలని భావించగా పంప్ హౌస్​లోని గేట్ వాల్వ్ లాక్ అయి మరోసారి అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు నిపుణులను తీసుకొచ్చి పనులు చేయించారు. బుధవారం సాయంత్రం వరకు పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ పవర్ సప్లైలో సమస్య కారణంగా మోటార్ మూడు సార్లు ట్రిప్ అయ్యింది. బుధవారం రాత్రి ఎంతసేపైనా ఇష్యూ సాల్వ్​చేయాలని.. నీటిని విడుదల చేయాలని ఆండ్రిట్జ్ ఇంజినీర్లతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, హనుమకొండ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సీతారాం నాయక్ తదితర ఆఫీసర్లు అక్కడే మకాంవేసి పని చేశారు. బుధవారం అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో మోటార్ ను ఆన్ చేశారు. దేవన్నపేట పంప్ హౌస్ నుంచి పైపులైన్ ద్వారా దాదాపు 6.59 కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు గురువారం తెల్లవారుజామున 3.27 గంటలకు ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకున్నాయి. గురువారం సాయంత్రం మంత్రులు మోటార్ స్విచ్ ఆన్ చేసి దేవాదుల నీటిని విడుదల చేశారు.

60 వేల ఎకరాలకు సాగునీరు

దేవన్నపేట పంప్ హౌస్ లో ఒక్కొక్కటి 31 మెగా వాట్స్ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక దానిని ప్రస్తుతం ఆన్ చేశారు. ఆ పంపుతో దాదాపు 600 క్యూసెక్కుల నీటిని ధర్మసాగర్ రిజర్వాయర్ కు ఎత్తి పోయగా.. అక్కడి నుంచి సౌత్ మెయిన్ కెనాల్ ద్వారా నష్కల్ ట్యాంక్, అక్కడి నుంచి పాలకుర్తి ట్యాంక్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల్లోని 60 వేల ఎకరాలకు సాగు నీటిని రిలీజ్ చేశారు. పంటలు ఎండుతున్న దశలో సాగు నీరు అందుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.