వేసవిలోపు లిఫ్ట్ లన్నీ పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

వేసవిలోపు లిఫ్ట్ లన్నీ పూర్తి చేయాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

సూర్యాపేట / కోదాడ, వెలుగు : కోదాడ, హుజూర్​నగర్ నియోజకవర్గాల పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ వేసవిలోపు పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కోదాడ, హుజూర్​నగర్ నియోజకవర్గాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి, కలెక్టర్ నందలాల్ పవార్ తో కలిసి కోదాడలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు నియోజకవర్గాల్లో అనుకున్న చోట్ల ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచాలని, అందుకునుగుణంగా సాంకేతిక అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు. పాలేరు వాగుపై నిర్మించ తలపెట్టిన ఉత్తమ్ పద్మావతి ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే పునరుద్ధరించాలన్నారు. అందుకు నిధులు మంజూరు చేయడంతోపాటు టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున పనులు వేగవంతం చేయాలని చెప్పారు.

ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే  కొత్తగా 5 వేల ఆయకట్టు సేద్యం లోకి వస్తుందన్నారు. రూ.47.67 కోట్లతో మంజూరు చేయించిన రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. జానపహాడ్ ఎత్తి పోతల పథకం సామర్థ్యాన్ని పెంచడంతోపాటు అందుకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు పొందాలని సూచించారు. అటు హుజూర్​నగర్ ఇటు కోదాడ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన కాల్వల లైనింగ్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూసేకరణ త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ల నిర్మాణంలో అలసత్వం చూపొద్దని చెప్పారు. హుజూర్​నగర్ రింగ్ రోడ్ నిర్మాణం, కోదాడ నుంచి అనంతగిరి రహదారి విస్తరణ పనులు చేపట్టాలని తెలిపారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పస్టం చేశారు. కార్యక్రమంలో నీటిపారుదల చీఫ్ ఇంజినీర్ రమేశ్ బాబుతోపాటు అధివకారులు పాల్గొన్నారు. 

దేశంలోనే తెలంగాణ పోలీస్ ప్రథమ స్థానం.. 

దేశంలోనే తెలంగాణ పోలీసు ప్రథమ స్థానంలో ఉందని, పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలో డీఎస్పీ కార్యాలయాన్ని మల్టీజోన్ –2 ఐజీ సత్యనారాయణ, పోలీస్ హౌసింగ్ ఐజీ రమేశ్ రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ అనంతగిరి, చింతలపాలెం, పాలకీడు, మద్దిరాల, నాగారం పోలీస్ స్టేషన్లకు నూతన భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పోలీస్ భవనాల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌజింగ్ సొసైటీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్,  అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు రవి, శ్రీధర్ రెడ్డి, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ చైర్మన్ వేణారెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.