చరిత్రలో నిలిచిపోయే చట్టాలు తెచ్చిన గ్రేట్ లీడర్ మన్మోహన్ సింగ్: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భారత దేశ ముద్దుబిడ్డ అని.. దేశంలోని అనేక ఉన్నత పదవులను ఆయన నిర్వహించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఇటీవల మరణించిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు సంతాపం తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం (డిసెంబర్ 30) ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మన్మోహన్ సింగ్‎కు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. 

ఈ తీర్మానంపై మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. భారత దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చట్టాలను మన్మోహన్ సింగ్ తీసుకొచ్చారని అన్నారు. ఆయన తీసుకొచ్చిన భూసేకరణ చట్టం విప్లవాత్మకమైన లెజిస్లేషన్ అని కీర్తించారు. అలాగే.. అటవీ హక్కుల చట్టంతో ఆదివాసీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. సామాన్యులకు సమాచారాన్ని ఇవ్వడం హక్కుగా మార్చారని చెప్పారు. పేదల ఆకలి చావుల కట్టడికి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చారన్నారు. 

ALSO READ : శాసన సభలో గందరగోళం.. రికార్డుల నుండి ఏలేటి వ్యాఖ్యలు తొలగింపు

భారత దేశ ప్రయోజనాల కోసమే మన్మోహన్ సింగ్ అమెరికాతో అణు ఒప్పందం  చేసుకున్నారని.. ఈ ఒప్పందాన్ని యూపీఏ కూటమిలోని మిత్రపక్షాలు వ్యతిరేకించిన అలాగే ముందుకెళ్లారని గుర్తు చేశారు.ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్లారని అన్నారు. పీవీ శతాబ్ధి జయంతి వేడుకలకు మన్మోహన్ సహకరించారని.. పీవీపై ఉన్న గౌరవాన్ని మన్మోహన్ సింగ్ తన ప్రసంగంలో చెప్పారన్నారు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చారని అన్నారు.