- ఉమ్మడి జిల్లాలో కొత్త ఆయకట్టు వస్తుంది
కామారెడ్డి, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదేండ్లలో ఇరిగేషన్ పరంగా మార్పు చూస్తారని, కొత్త ఆయకట్టు వస్తుందని రాష్ర్ట ఇరిగేషన్, సివిల్సప్లయ్శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని మంత్రి విడుదల చేసి ప్రాజెక్టును పరిశీలించారు. మంత్రికి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని సీఈ శ్రీనివాస్ వివరించారు. అనంతరం జుక్కల్, బాన్సువాడ, బోధన్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని మంత్రిని కోరారు.
నాగమడుగు, లెండి ప్రాజెక్టు, ప్యాకేజీ 22 పనులు చేపట్టి బీడు భూములకు సాగునీరు ఇవ్వాలని కోరారు. నిజాంసాగర్ కాల్వలకు నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామన్నారు. అంతరాష్ర్ట ప్రాజెక్టు అయిన లెండిపై మహారాష్ర్ట అధికారులతో మాట్లాడతానన్నారు. జాకోరా, చకోరా వద్ద సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 22వ ప్యాకేజీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
పనుల విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టేట్ ఆగ్రో ఇండస్ర్టీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ అనిల్, కలెక్టర్ఆశిశ్ సంగ్వాన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, ఆయా శాఖల ఆఫీసర్లు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.