- కమీషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిండు: ఉత్తమ్
- ఎన్డీఎస్ఏ రిపోర్టుల ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు
- కాంట్రాక్ట్ సంస్థల సొంత ఖర్చులతోనే మరమ్మతులు
- తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కడ్తం
- తప్పు చేసినవాళ్లను వదలం
- మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించిన మంత్రి
- అన్నారం బ్యారేజీ నిర్మాణంలోనే లోపాలు
- మంత్రికి వివరించిన ఇంజినీర్లు
జయశంకర్ భూపాలపల్లి/మహాదేవ్‌పూర్/పెద్దపల్లి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ.2 లక్షల కోట్లు గంగలో పోసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ కమీషన్ల కక్కుర్తితో ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని ఫైర్ అయ్యారు. కమీషన్ల కోసం రూ.2 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అప్పులకు ఇప్పుడు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఇంజినీర్లతో కలిసి ఉత్తమ్ శుక్రవారం పరిశీలించారు.
వానాకాలం వరదలు వచ్చేలోగా రిపేర్లు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత బీర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ.94 వేల కోట్లు ఖర్చు చేసింది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై రూ.23,500 కోట్లు, సీతారామసాగర్ ప్రాజెక్ట్ కోసం రూ.7,500 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లియ్యలేదు. ప్రాజెక్టుల పేరుతో రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు దండుకున్నరు. స్టెబిలైజేషన్ పేరుతో ప్రజలను మోసం చేసిన్రు” అని మండిపడ్డారు. ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఇంతలా నాశనం చేయగలరా? అని ఆశ్చర్యపడేలా కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ కట్టి తీరుతామని వెల్లడించారు. వచ్చే ఏడాది కొత్తగా 7 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్ట్‌లు చేపడుతున్నామని తెలిపారు.
సుందిళ్లలో పనుల ఆలస్యంపై ఆగ్రహం..
సుందిళ్ల బ్యారేజీ వద్ద రిపేర్ వర్క్స్ స్లోగా జరుగుతుండడంపై ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా మెషినరీ, మ్యాన్ పవర్ అందుబాటులోకి తేవాలని.. గడువులోగా పనులు కంప్లీట్ చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్ట్ సంస్థను హెచ్చరించారు. అనంతరం అన్నారం బ్యారేజీకి వచ్చిన ఉత్తమ్.. అక్కడ కింది వైపు పిల్లర్ల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. రిపేర్ వర్క్స్ గురించి మంత్రికి ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ బ్యారేజీకి ప్రవాహ ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ముంపు సమస్య కూడా ఎక్కువేనని ఇంజినీర్లు తెలిపారు.
అన్నారం బ్యారేజీ నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందని, అప్పట్లో తమ సూచనలను సర్కార్ పట్టించుకోలేదని మంత్రికి వివరించారు. ఆ తర్వాత ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని ఏడో బ్లాక్ లోని 16వ గేటు, 18, 19వ గేట్ల వద్ద పిల్లర్ కు వచ్చిన క్రాక్స్ ను పరిశీలించారు. గతంతో పోలిస్తే పిల్లర్ క్రాక్స్ మధ్య సందు మరింత పెరిగిందని మంత్రి అభిప్రాయపడ్డారు. గ్రౌటింగ్ ఎలా చేస్తున్నారో వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. డౌన్ స్ట్రీమ్ లో షీట్ ఫైల్స్ సీసీ బ్లాక్ లను పరిశీలించి పనులు వేగంగా చేయాలని సూచించారు.
ఎన్డీఎస్ఏ సూచనల మేరకే రిపేర్లు..
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ సూచనల ప్రకారమే రిపేర్లు చేపట్టామని ఉత్తమ్ తెలిపారు.‘‘ఈ వర్షాకాలంలో నీటిని నిల్వ చేయడం వీలు కాదని, మూడు బ్యారేజీల గేట్లు ఎత్తి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. బ్యారేజీలు డ్యామేజీ కాకుండా ఉండడం కోసం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయాలని చెప్పింది. కేసీఆర్ మాత్రం బ్యారేజీలలో వాటర్ స్టోరేజీ చేసి, నీటిని లిఫ్టింగ్ చేయవచ్చని పదేపదే చెబుతున్నాడు. కానీ వాటర్ స్టోరేజీ చేస్తే బ్యారేజీలు పూర్తిగా కూలిపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది.
గతంలోనే మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ అయిందని, దాన్ని సరిచేయకుండా వాటర్ స్టోరేజీ చేయడం వల్లనే పిల్లర్లు కుంగినట్టు పరిశోధనలో తేలింది” అని చెప్పారు. కాంట్రాక్ట్ కంపెనీలు సొంత ఖర్చులతోనే బ్యారేజీల రిపేర్లు చేస్తున్నాయని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎల్ అండ్ టీ కంపెనీ, అన్నారం బ్యారేజీకి ఆఫ్కాన్ కంపెనీ, సుందిళ్ల బ్యారేజీకి నవయుగ కంపెనీ ద్వారా రిపేర్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారారాయణ, రాజ్ ఠాకూర్, లక్ష్మణ్, ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరినీ వదిలిపెట్టం..
కాళేశ్వరం బ్యారేజీలు డ్యామేజీ కావడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అప్పటి ఇంజినీర్లను ఇంటికి పంపామని, జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు కచ్చితంగా తీసుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టమని చెప్పారు. ‘‘విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఈఎన్సీ వెంకటేశ్వర్లు, మురళీధర్ ను తొలగించాం. జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం” అని పేర్కొన్నారు. పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను తొలుత పూర్తి చేస్తామన్నారు.