- హుజూర్ నగర్‌ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుతా
- ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
- నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు: జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, హుజూర్ నగర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి పనిచేయాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. హుజూర్ నగర్ లో రూ.50 లక్షలతో చేపట్టిన క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించారు.
మేళ్లచెరువు మండల కేంద్రంలో రూ.55 లక్షలతో నిర్మిస్తున్న శివాలయ దక్షిణ రాజగోపురం, రూ.కోటిన్నరతో చేపట్టనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మున్సిపాలిటీ మీటింగ్ హాల్లో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ ఐడీసీ) రూ.50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధి పనులు, మెయిన్ రోడ్ నుంచి షాదీఖానా వరకు సీపీ రోడ్డు నిర్మాణం, ఎన్ఎస్సీ క్యాంపు నుంచి లింగగిరి రోడ్డు వరకు సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.3 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఆక్రమణకు గురైన మున్సిపల్ ల్యాండ్లను తిరిగి తీసుకోవాలని, కోర్టులో పెండింగ్‌లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి, మున్సిపల్ వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదుద్దుతాం
కోదాడ, వెలుగు : నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం కోదాడ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం అనంతగిరి మండలంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని, అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్ద చెరువుపై స్వాగత ద్వారాలు, ముస్లిం కమ్యూనిటీ భవనం ఇతర అభివృద్ధి పనులను వేగవంతం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
నూతనంగా ఏర్పడిన అనంతగిరి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని, ఒక్కో కార్యాలయ నిర్మాణానికి కోటి రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అడిషనల్ ఎస్సీ నాగేశ్వరరావు, ఆర్డీవో సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ప్రమీల, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.